Special Edition Of NTR Centenary Book : మే 28న ప్రారంభమైన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజుల పాటు కొనసాగనున్నాయని గతంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
అన్నగారి శత జయంతి ప్రత్యేక సంచిక :తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు.. అన్న ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకొని నందమూరి కళా పరిషత్ అద్దంకి వారు ముద్రించిన "ఎన్టీఆర్ శత జయంతి" ప్రత్యేక సంచికను ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
నందమూరి కళా పరిషత్ సభ్యులను అభినందించిన చంద్రబాబు : ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమ సమాజవాది ఎన్టీఆర్ అని తెలిపారు. పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది, మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందమూరి కళా పరిషత్ సభ్యులను చంద్రబాబు అభినందించారు. ఆ మహానుభావుని కళా సేవ, ప్రజా సేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నందమూరి కళా పరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, నాగినేని రామ కృష్ణ, కరి పరమేష్, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు సుబ్బయ్య, పరిటాల పవన్, కొల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.