తెదేపా అధినేత చంద్రబాబు, కుటుంబ సభ్యులతో కలిసి తుళ్లూరు రాజధాని రైతులను కలిశారు. వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. అమరావతి శక్తిపీఠమని.. తీసేసే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని రైతులు సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేసిన చంద్రబాబు.. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. 5 కోట్ల మంది ప్రజలు తలచుకుంటే వైకాపా ఎమ్మెల్యేలు బయట తిరగగలరా? అని ప్రశ్నించారు. ప్రజలు అగ్నితో సమానమని... చెలగాటం ఆడితే వైకాపాకే నష్టమని హెచ్చరించారు.
'రైతులు చనిపోతుంటే... మంత్రులు కోళ్ల పందేలు ఆడుతున్నారు'
అభివృద్ధిని ఆపేసి.. అరాచకానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చంద్రబాబు అన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. తాను అమరావతి, పోలవరాన్ని రెండు కళ్లుగా భావించి అభివృద్ధి చేస్తే... వాటికి చూపు లేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. అమరావతి కోసం 18 మంది రైతులు చనిపోతే మంత్రులు కోళ్ల పందేలు ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి 29 గ్రామాల ప్రజల సమస్య కాదన్న చంద్రబాబు... 5 కోట్ల ప్రజల సమస్య అని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
'పరిశ్రమలు పారిపోతున్నాయి'
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టి.. ఆ ప్రాంత అభివృద్ధి కృషి చేశామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావాలి.. అక్కడివారికి ఉపాధి కావాలని ఆకాంక్షించామని తెలిపారు. విశాఖ జిల్లాకు వచ్చిన పరిశ్రమలన్నీ వైకాపా పాలనతో పారిపోయాయని అన్నారు.