Chandrababu Criticized CM Jagan in Sand Mining:సీఎం జగన్‌ను ఇంకా భరించలేమని.. బైబై జగన్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళగిరిలో నిర్వహించగా.. సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇసుక దోపిడికి వ్యతిరేకంగా ఇసుక సత్యగ్రహం పేరుతో.. ఈనెల 28 నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇసుకపై జగన్ ఆధిపత్యం ఎంటనీ ప్రశ్నించారు. జగన్, పెద్జిరెడ్డి, జే-గ్యాంగ్ కలిసి 40 వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను దోచేశారని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం అబద్దాలు చెప్తోంది: వైసీపీ ప్రభుత్వం 90శాతం హామీలను అమలు చేశామని అబద్దాలు చెప్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం విపరీతంగా పెంచిందని విమర్శించారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై మోపారని ఆక్షేపించారు. ఉచిత విద్యుత్ విషయంలోనూ రైతులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఇన్ని తప్పులు చేసిన జగన్ ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉండాలా అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తి జగన్ అని విమర్శించారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ తెలుగు దేశమేనని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు
పుంగనూరు, అంగళ్లు బాధితులను గుండెల్లో పెట్టుకుంటాము: పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల వల్ల 92మంది కుటుంబాలు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాయని అన్నారు. ఆ కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిని గుండెల్లో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు.
అక్రమాలకు పాల్పడిన వారికి టీడీపీ బోర్డులో స్థానం: మద్యం స్కాంలో హస్తం ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో సభ్యునిగా స్థానం కల్పించటంపై చంద్రబాబు మండిపడ్డారు. అప్రూవర్‌గా మారడం అంటే.. తప్పు చేశానని ఒప్పుకోవడమేనని అన్నారు. అలా అప్రూవర్‌గా మారిన వ్యక్తికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారని ప్రశ్నించారు. టీటీడీ సభ్యుల నియామకం సహా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అన్ని తప్పిదాలను ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.