TDP Foundation Day : తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ నేటితో 41 వసంతాలు పూర్తి చేసుకుంది. 42వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఆత్మ గౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని ఆకాక్షించారు.
లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలం : తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా రాజకీయ చైతన్యానికి సంకేతంగా టీడీపీ ఆవిర్భవించి 41 ఏళ్లు అయ్యిందనీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అన్నగారి ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందన్నారు. బడుగుబలహీనవర్గాలకు భరోసా అవ్వడంతో పాటు మహిళల స్వావలంబనకు చేయూతనందించిందన్నారు. సకల రంగాల అభివృద్ధిపైనా టీడీపీ సంతకం చెరగనిదన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలమని కొనియాడారు. నందమూరి తారకరాముని ఆశీస్సులు, చంద్రన్న దిశానిర్దేశంలో ప్రజాసంక్షేమమే లక్ష్యం, ప్రగతే ధ్యేయంగా దశాబ్దాలుగా టీడీపీ ప్రయాణం సాగుతోందని తేల్చి చెప్పారు. తాను తెలుగువాడినని సంతోషిస్తానన్న లోకేశ్, తను తెలుగుదేశం వాడినని గర్విస్తానన్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.