Chandrababu Christmas Wishes to Christians:రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలుగుదేశం సినీయర్ నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్రంలోని క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్టమస్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ పండగ రాయదుర్గంలోని రాజీవ్ గాంధీ కాలనీలో జీసస్ కాలింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నారా లోకేశ్‌కు క్రిస్మస్ కానుక పంపిన షర్మిల - కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డలోని ఐవీఎం హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యానంలోని గౌతమీ గోదావరి తీరాన ఉన్న భారీ ఏసుక్రీస్తు విగ్రహం వద్ద , పట్టణంలోని అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద క్రిస్మస్ సందడి నెలకొంది. రోమన్ క్యాథలిక్ చర్చ్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ విద్యుత్ వెలుగుల్లో చర్చ్ సుందరంగా భక్తులను ఆకర్షించింది.
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Lokesh Christmas Wishes: ఏసు క్రీస్తు ఆచరించిన ప్రేమ, కరుణ, సహనం ప్రతీ ఒక్కరిలో పెంపొందాలని లోకేశ్ తెలిపారు. క్రిస్మస్ పండగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకను ప్రజలంతా కలసికట్టుగా జరుపుకోవాలని, అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఏసు మార్గంలో నడుస్తూ ప్రజలందరి పట్ల కరుణ, ప్రేమతో మెలుగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సద్గుణం, విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి ఏసుక్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సామరస్యం కోసం ప్రార్థించాలని ఆకాంక్షించారు.
లక్ష మందితో భగవద్గీత పారాయణం- శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్- గిన్నిస్ రికార్డు పక్కా!