AP DEBTS: దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల గణాంకాలను కేంద్రం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. 2022 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 3 లక్షల 98వేల 903.60 కోట్లని.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభకు ఇచ్చిన గణాంకాల్లో చెప్పారు. జీడీపీలో అప్పుల వాటాను కూడా వెల్లడించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అప్పు, ఇతరత్రా చెల్లింపుల భారం కలిపి 8 లక్షల 71 వేల కోట్లకు చేరిందని నిపుణులు లెక్కలు వేస్తున్న వేళ.. కేంద్రం చెప్పిన రుణాల లెక్క ఇంత తక్కువుగా ఉందేమిటన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇందులో అసలు లెక్క వేరే ఉంది. ఆయా గణాంకాలకు ఆధారం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా... కేంద్రం ఇచ్చిన గణాంకాల్లోనే పేర్కొన్నారు.
"స్టేట్ ఫైనాన్సెస్:ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2021-22” పుస్తకమే తమ లెక్కలకు ఆధారమని కేంద్రమంత్రి స్వయంగా వెల్లడించారు. 2021 నవంబర్లోనే రిజర్వ్ బ్యాంకు ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. R.B.I వెబ్సైట్లోనూ ఉంది. లోక్‌సభలో సోమవారం కేంద్రం వెల్లడించిన గణాంకాలన్నీ అందులోనివే. మరి ఆ గణాంకాలకు ఆధారమేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో ప్రతిపాదించిన, సవరించిన గణాంకాలేనని అదే పుస్తకంలో రిజర్వ్ బ్యాంకు స్పష్టంగా చెప్పింది. అంటే.. కేంద్రం వెల్లడించిన అప్పుల లెక్కలన్నీ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎప్పటికప్పుడు చెబుతున్నవే. కేంద్రం కొత్తగా చెప్పినవేవీ ఇందులో లేవు. పైగా రాష్ట్రాలు రహస్యంగా చేస్తున్న, పరిమితికి మించి వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పుల వివరాలు ఆయా గణాంకాల్లో కలిసి ఉండే అవకాశమే లేదు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తున్న అప్పుల అంకెలనే కేంద్రమూ లోక్‌సభలో వెల్లడించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అసలు అప్పులు ఇందులో బయటపడే అవకాశం లేకుండా పోయింది.
తెలంగాణ ఎంపీలు వెంకటేష్ నేత బొర్లకుంట, జి.రంజిత్‌రెడ్డి, కవిత మాలోతు అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వక జవాబిచ్చారు. రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది, అయిదేళ్లలో ఏ రాష్ట్ర అప్పు ఎంత శాతం పెరుగుతూ వస్తోంది, ప్రస్తుత ఏడాది ఎంత అప్పుందనే వివరాలను ఎంపీలు అడిగారు. వీటితోపాటు కేంద్రం చేసిన అప్పులు, జీఎస్డీపీలో ఆయా రాష్ట్రాల అప్పుల వాటా ఎంత అని కూడా ప్రశ్నించారు. రాష్ట్రాలు తాము అప్పులు చేసుకునేందుకు ఉన్న నికర రుణ పరిమితిని అధిగమించాయా, ఒకవేళ అధిగమిస్తే వాటినీ తెలియజేయాలని ఎంపీలు కోరారు.
ఈ ప్రశ్నకు మాత్రం కేంద్రం సమగ్రంగా సమాధానం పొందుపరచలేదు. రాష్ట్రాలు తమ ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రుణాలు తీసుకుంటున్నాయని, కేంద్ర ఆర్థికశాఖ, వ్యయ నియంత్రణ విభాగాలు పరిమితులు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నాయని మాత్రమే మంత్రి సమాధానం ఇచ్చారు.