ఏపీ రాజధానిగా అమరావతి.. 2015లోనే రాష్ట్రం నోటిఫై చేసిందని తేల్చి చెప్పిన కేంద్రం - రాజధానిపై కేంద్రం
14:53 February 08
సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగిందన్న కేంద్రం
Central on Amaravati : బుధవారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి.. అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం.. రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారని.. ఈ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. సమగ్ర అధ్యయనం తర్వాత అమరావతినే ఏపీ రాజధానిగా ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని.. లిఖిత పూర్వక సమాధానంలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి తెలిపారు. 2015లో దీన్నీ నోటిఫై చేశారని వివరించారు.
2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తెచ్చిందని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించింది. బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం.. తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అనంతరం ఆ బిల్లును వెనక్కి తీసుకుంటూ ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని కొనసాగింపుగా మరొక బిల్లును తీసుకొచ్చినట్లుగా వివరించారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజధాని అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉండటంతో.. దీనిపై ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదని దీనిపై మాట్లాడటం సబ్‌జ్యుడిస్ అవుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: