ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"విభజన చట్ట నిబంధనల మేరకే రాజధానిగా అమరావతి".. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ - what is the capital of ap

CENTRAL ON AMARAVATI : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంతో ముడిపెట్టింది. రాజధానిపై అధ్యయనం కోసం ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వెల్లడించింది. ఆ తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ సీఆర్​డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల చట్టాలను తీసుకొచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

CENTRAL ON AMARAVATI
CENTRAL ON AMARAVATI

By

Published : Feb 9, 2023, 6:58 AM IST

"విభజన చట్ట నిబంధనల మేరకే రాజధానిగా అమరావతి".. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​

CENTRAL ON AMARAVATI :ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించే ఏపీ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించిందని కేంద్ర హోం శాఖ తేల్చిచెప్పింది. దాని వల్ల చట్టంలోని సెక్షన్‌ 94ను అనుసరించి రాజధాని నిర్మాణం కోసం 2 వేల 500 కోట్లు ఇచ్చినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై చట్టం చేసే శాసనాధికారం ఏపీ అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గతంలోనే కేసు వేయగా... కేంద్ర హోం శాఖ అండర్‌ సెక్రటరీ శ్యామల్‌కుమార్‌ బిత్‌ బుధవారం 14 పేజీల అఫిడవిట్‌ దాఖలు చేశారు.

అందులో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6తో ముడిపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం రాజధానికి ప్రత్యామ్నాయాల అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదికను తగిన చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని, ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.

విభజన చట్టంలోని సెక్షన్‌ 94లో కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఉందన్నారు. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు ఇచ్చినట్లు తెలిపారు. సీఆర్‌డీఏను రద్దు చేసి, రాష్ట్రంలో మూడు రాజధానులకు వీలు కల్పించే వికేంద్రీకరణ చట్టాలను తెచ్చే ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లో ఏపీ విభజన చట్టం, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికల్లోని ముఖ్యాంశాలను జత చేశారు.

అఫిడవిట్​లో పొందుపరిచిన ముఖ్యాంశాలు:

ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించడానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 చేశారని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ చట్టంలోని 5వ నిబంధనలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హైదరాబాద్‌ కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఆ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్‌ తెలంగాణకు రాజధానిగా ఉంటుందని.. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి సంబంధించిన విభిన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి, విభజన చట్టం రూపొందిన ఆరు నెలల్లోపు తగిన సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది అని విభజన చట్టంలోని సెక్షన్‌ 6లో పేర్కొన్నట్లు తెలిపారు. సెక్షన్‌ 6ను అనుసరించి.. కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 28న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేసీ శివరామకృష్ణన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని... ఆ కమిటీ కొత్త రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి స్థూల మార్గదర్శకాలతో ఆగస్టు 30న నివేదిక సమర్పించిందని గుర్తు చేశారు.

తగిన చర్య కోసం కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆంధ్రప్రదేశ్‌కు పంపిందని.. దాని తర్వాత ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 23న అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇతర ముఖ్యమైన మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఉందని.. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2 వేల 500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

రాజధాని ప్రాంతంలో పట్టణ మౌలిక వసతుల కల్పన కోసం 2014-15లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఇచ్చిన వెయ్యి కోట్లు కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ -సీఆర్‌డీఏ రద్దు చట్టం-2020, ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల్లో సమ్మిళిత అభివృద్ధి-2020 చట్టాలు తీసుకొచ్చి 2020 జులై 31న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా రాష్ట్రంలో మూడు పరిపాలనా కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నట్లు వెల్లడించింది. ఈ రెండు చట్టాలు చేసే ముందు, రూపొందించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

న్యాయనిపుణుల అభిప్రాయాలు:

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6ల ద్వారా నూతన రాజధాని ఏర్పాటు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్లే దానిపై చట్టం చేసే అధికారం ఏపీ శాసన వ్యవస్థకు లేదని హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం ద్వారా రాజధాని ఎంపిక ఆ రెండు సెక్షన్లకు లోబడే జరగాలని రూఢీ అయిందన్నారు. వాటిని అనుసరించి కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం, దాని నివేదికపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం, దాన్ని అనుసరించి 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం జరిగిపోయినందున.... దాన్ని తిరగదోడటానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.

పార్లమెంటు చేసిన చట్టాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎంపిక బాధ్యతలను తీసుకొని, దాన్ని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పూర్తి చేసినందున అదే అధికారాన్ని తిరిగి ప్రయోగించడానికి వీల్లేదన్న ఉద్దేశంతోనే హైకోర్టు శాసనసభకు దీనిపై శాసనాధికారాలు లేవని చెప్పిందని పేర్కొన్నారు. ఏదైనా రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం అనుసరించాల్సిన నిర్దేశిత విధానం ఏదైనా ఉందా? అని 2020 ఫిబ్రవరి 11న టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఇదే కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిస్తూ ‘రాజధాని నగరంపై సంబంధిత రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చు.. అందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదని చెప్పారని గుర్తు చేశారు.

అయితే రాజధానిని నిర్ణయించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ముక్తకంఠంతో చెప్పిన మాట వాస్తవమా? అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకటికి మించిన రాజధానులను ఏర్పాటు చేసుకోవడానికి నిరాకరిస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి’ అని బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురించి ప్రత్యేకంగా అడిగినందున అదే కేంద్ర మంత్రి విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6ల గురించి ప్రత్యేకంగా చెప్పారని న్యాయనిపుణులు అంటున్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని గురించి ప్రత్యేకంగా చెప్పకపోతే వాటిని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటుందని.. కానీ ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఆ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి ఎంపిక ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించే జరిగిందని అభిప్రాయపడ్డారు.


హామీలు చాలా అమలు చేశాం:విభజన చట్టంలో చెప్పిన చాలా హామీలు ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన వాటి అమలు వివిధ దశల్లో ఉందని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని అంశాల అమలు గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. మూడేళ్లలో 5 సమీక్షలు జరిగినట్లు వెల్లడించారు. సమస్యలను ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని కేంద్రం సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details