ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం మరోసారి మొండిచెయ్యి.. ఆ రైల్వే ప్రాజెక్టులకు నిధులేవి

‍‌Central Budget: ‍‌రాష్ట్రంలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్నవాటికి అరకొర కేటాయింపులు చేయడంతో అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అనేక కొత్త లైన్లను ప్రకటించి, గతంలోనే బడ్జెట్లు చూపించినా.. వాటికి నామమాత్రంగా వెయ్యి, లక్ష, 10 లక్షల చొప్పున విదిల్చింది.

Funding for railway projects
Funding for railway projects

By

Published : Feb 4, 2023, 9:55 AM IST

Updated : Feb 4, 2023, 12:43 PM IST

Central Budget: ‍‌2023-24 కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయింపు వివరాలు తెలిపే పింక్‌బుక్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు సాధించడంలో రాష్ట్రప్రభుత్వం, వైసీపీ ఎంపీలు విఫలం కావడంతో... మరోసారి బడ్జెట్‌లో అరకొర నిధులే మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే కొత్త ప్రాజెక్టులకు మూడేళ్లుగా నిధులివ్వకపోవడంతో.. అవి ముందుకు సాగడం లేదు. ఈసారి రైల్వేశాఖ అందులో రెండింటికే కొంత నిధులిచ్చింది. పలు కొత్తలైన్లకు మంజూరు చేసిన నిధులు చూస్తే.. అవి పూర్తయ్యేందుకు దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

విభజన హామీలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా జోన్‌, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగే‌ళ్లయింది. వీటికి అవసరమైన భవనాల నిర్మాణం, వసతుల కల్పనలకు 170 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదించి... కేవలం 10 కోట్లే కేటాయించారు. రాజధాని ప్రాంతమైన అమరావతికి ఇటు విజయవాడ, అటు గుంటూరు వైపు రైల్వేలైన్లతో అనుసంధానం చేసే ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు.., అమరావతి-పెదకూరపాడు.., సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 106 కిలోమీటర్ల కొత్తలైన్‌కు రైల్వేశాఖ మళ్లీ మొండిచెయ్యి చూపింది. దీనికి 2 వేల 679 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా.. బడ్జెట్‌లో 10 లక్షలే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా ఇస్తుందో తెలపాలని రైల్వేశాఖ కోరుతుంటే... రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. దీంతో కేంద్రం కూడా నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపింది.

అనేక కొత్తలైన్ల నిర్మాణ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు చూస్తే.. అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. కడప-బెంగళూరు మధ్య 255 కిలోమీటర్ల లైన్‌లో భాగంగా రాష్ట్రంలో 218 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన కొత్తలైన్‌కు బడ్జెట్‌లో 10 లక్షల రూపాయలే కేటాయించారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్తలైన్‌ను 309 కిలోమీటర్ల మేర నిర్మించాలి. దీని అంచనా విలువ2 వేల 289 కోట్లు.ఈసారి బడ్జెట్‌లో దీనికి 202 కోట్లు కేటాయించారు. కోటిపల్లి-నరసాపురం కొత్తలైన్‌ పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. 2 వేల 120 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రవాటా 25 శాతం ఇవ్వలేదు. దీంతో ఈసారి కేంద్రం బడ్జెట్‌లో 100 కోట్లు మంజూరు చేసింది. మాచర్ల-నల్గొండ లైన్‌కు వెయ్యి రూపాయలు, కాకినాడ-పిఠాపురం లైన్‌కు లక్ష, గూడూరు-దుగరాజపట్నం లైన్‌కు 10 లక్షలు, కొండపల్లి-కొత్తగూడెం లైన్‌కు 10 లక్షలు, కంభం-ప్రొద్దుటూరు లైన్‌కు కోటి రూపాయలు, భద్రాచలం, కొవ్వూరు లైన్‌కు 20 కోట్లు మాత్రమే కేటాయించారు. సర్వే దశలో ఉన్న దువ్వాడ-విజయవాడ లైన్‌కు 10 లక్షలే ఇచ్చారు.

మన రాష్ట్ర పరిధిలో ఉన్న పలు రెండో, మూడో లైన్లకు నిధులు అధికంగానే కేటాయించారు. గుంటూరు-గుంతకల్లు రెండో లైన్‌కు 980 కోట్లు, విజయవాడ-గూడూరు మూడో లైన్‌కు 800 కోట్లు, కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు 337.51 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే... విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నరసాపురం-నిడదవోలు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో లైన్‌కు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్తవలస-కోరాపుట్‌ రెండో లైన్‌కు 410 కోట్లు, విజయనగరం-సంబల్‌పూర్‌ రెండో లైన్‌కు 920 కోట్లు, ధర్మవరం-పాకాల-కాట్పాడి రెండో లైన్‌కు 40 కోట్లు, గుత్తి-ధర్మవరం రెండోలైన్‌కు 90.6 కోట్లు కేటాయించారు.విజయవాడ బైపాస్‌లైన్‌, కాజీపేట బైపాస్‌లైన్‌కు 310 కోట్లు మంజూరు చేశారు. కర్నూలులోని వ్యాగన్‌ మరమ్మతుల కేంద్రానికి 125 కోట్ల రూపాయలు కేటాయించారు. 2013-14లో వ్యాగన్ మరమ్మతుల కేంద్రం మంజూర కాగా... పదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి.

ఆ రైల్వే ప్రాజెక్టులకు నిధులేవి

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2023, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details