Christmas Wishes: క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరీసోదరమణులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న క్రీస్తు ఆరాధకులందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ అన్నది మానవ లక్షణం అని, సాటి మనిషి పట్ల ప్రేమను, కనికరాన్ని కలిగి ఉండాలని క్రీస్తు మనకు బోధించారన్నారు. లోకానికి నిస్వార్థ సేవామార్గాన్ని సూచించిన శాంతి ప్రదాత క్రీస్తు అని పేర్కొన్నారు. తనకు కీడు తలపెట్టిన స్వార్థపరులను సైతం క్షమించగలిగాడు కాబట్టే జనం ఆయన్ను దైవకుమారుడిగా భావించి ప్రార్థిస్తున్నారని వెల్లడించారు. సమాజం కోసం జీవితాన్ని, చివరికి ప్రాణాలు సైతం అర్పించిన త్యాగమూర్తి క్రీస్తు మార్గం సర్వజనులకు ఆచరణీయమన్నారు. ఆయన చూపిన మార్గంలో పేదల పట్ల కరుణ కలిగి ఉందామని సూచించారు. కరుణామయుడైన ఏసు దీవెనలు మీ ఇంటిల్లిపాదికీ లభించాలని.. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని ప్రశాంతతను పంచాలని కోరుకుంటున్నా అన్నారు.
త్యాగం.. శాంతి.. ప్రేమ సందేశాలు:లోకభాంధవుడుగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పశువులపాకలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవించి ప్రపంచానికి త్యాగం.. శాంతి.. ప్రేమ సందేశాలను ఆచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు సర్వదా ఆచరణీయమన్నారు. 'ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు, ద్రోహ చింతన విడనాడాలి' అన్న క్రీస్తు వ్యాక్యము శ్రేయోదాయకమన్నారు. అబద్దం, లంచం, లోభానికి పాల్పడనివారే నిజమైన క్రీస్తు భక్తులు అని చెప్పిన బైబిల్ సారాన్ని విశ్వసిస్తామన్నారు. ఈ ఆనందపు వేళ ప్రజలందరికీ అంతులేని ఆనందాన్ని, సంపదను ప్రసాదించాలని ఏసు క్రీస్తును ప్రార్ధిస్తునన్నారు.