Cases on Capital Amaravati Farmers: పోలీసులపై మాత్రం ఇంత వరకు ఒక్క కేసూ లేదు Cases on Capital Amaravati Farmers: రాజధానిని తరలించొద్దని, ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి అమరావతి నిర్మాణం కొనసాగించాలని, తమకు స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వమన్నందుకు జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై ప్రతీకార చర్యలకు దిగింది. 29 గ్రామాలతో కూడిన ఒక ప్రాంతాన్ని అదేదో శత్రువుల స్థావరం అన్నట్టుగా చూడటం, నిరంతరం నిఘా పెట్టడం, వేల సంఖ్యలో పోలీసుల్ని మోహరించి అష్టదిగ్బంధం చేయడం, దాడులకు దిగడం, ఇనుపకంచెలతో అడ్డుగోడలు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించడం వంటి అప్రజాస్వామిక చర్యలకు విచ్చలవిడిగా పాల్పడింది.
ముగ్గు వేసినా కేసు: రాజధాని ప్రాంత రైతులు నోరు తెరిస్తే కేసు, ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు, మాస్క్ పెట్టుకోలేదని కేసు, అమరావతి జెండా పట్టుకుంటే కేసు, గట్టిగా గళమెత్తితే కేసు, చివరకు పొంగళ్లు సమర్పించుకోవడానికి దుర్గ గుడికి వెళ్తున్నా కేసు, శాంతియుతంగా పాదయాత్ర చేసినా కేసు! గత నాలుగేళ్లలో సుమారు 3 వేల మంది రైతులు, మహిళలు, ఎస్సీలు, మైనార్టీలపై ఈ ప్రభుత్వం 500కి పైగా అక్రమ కేసులు పెట్టింది. చాలా మందిపై 25, 30 కేసులు కూడా ఉన్నాయి.
అమరావతి అభివృద్ధి చేయలేని జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేస్తాడు ?: రాజధాని రైతులు
చీమ చిటుక్కుమంటే కేసు: రైతులపై కేసులు పెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రపన్నిన జగన్ ప్రభుత్వం, ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఏదో ఒక సాకుతో అక్రమ కేసులు బనాయించసాగింది. రాజధాని గ్రామాల్లో చీమ చిటుక్కుమంటే చాలు, దానికి రైతులే కారణమంటూ కేసులు పెట్టింది. రైతుల్లో చాలా మందికి తాము ఏయే కేసుల్లో ఉన్నామో, ఏ కారణంతో తమపై ఆ కేసులు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. ఏదైనా ఘటన జరిగినా, జరగకపోయినా రైతులు అక్కడ ఉన్నా లేకపోయినా పోలీసులు అక్రమ కేసులు పెట్టేశారు.
గుర్తొచ్చిన పేర్లన్నీ రాసేయడం: మొదట నాలుగైదు పేర్లతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వారితో పాటు ‘ఇతరులు' అని పెట్టడం, ఛార్జిషీట్ ఫైల్ చేసేనాటికి వారికి గుర్తొచ్చిన పేర్లన్నీ రాసేయడం వంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. ఒకే ఘటనపై ముగ్గురు కానిస్టేబుళ్లతో విడివిడిగా ఫిర్యాదు చేయించి మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సందర్భాలున్నాయి.
తోచిన కారణం చెబుతూ కేసులు బనాయించి: అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి రాజధానిలో సెక్షన్ 144, పోలీసు చట్టంలోని సెక్షన్ 30లను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం, వాటిని ఉల్లంఘించారని, పోలీసుల్ని అడ్డుకున్నారని, దాడి చేశారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులకు అడ్డుపడ్డారని, ట్రాఫిక్‌కి అవరోధం కలిగించారని, బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలియజేశారని ఇలా వారికి తోచిన కారణం చెబుతూ కేసులు బనాయించారు. ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపొద్దు - బాధితులను పరామర్శించొద్దు - ప్రతిపక్షాలపై జగన్ రాజ్యాంగం!
డ్రోన్‌ను ధ్వంసం చేశారని 82 మందిపై కేసు: అమరావతి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో రైతులు కాజా టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలియజేశారు. ఆ ఘటనలో 145 మందిపై కేసు పెట్టారు. పోలీసులు రాజధాని గ్రామాల్లో ఇళ్లపై డ్రోన్ ఎగరేసి, చిత్రీకరించడాన్ని రైతులు అడ్డుకున్నారు. పైకప్పులేని స్నానాలగదులపై డ్రోన్‌లు ఎగరవేయడం మహిళలకు ఇబ్బందికరమని వారు అభ్యంతరం చెప్పినందుకు, పోలీసులతో గొడవపడ్డారని, డ్రోన్‌ను ధ్వంసం చేశారని 82 మందిపై కేసు పెట్టారు.
ఆ కేసులో సుమారు 10 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. మిగతావారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రాజధాని ఉద్యమంలో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారని, వారిపైనా ప్రభుత్వం భారీగా అక్రమ కేసులు పెట్టింది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మహిళపైనా ఏదో ఒక కేసు ఉంది.
నిద్రపోతున్నవారిని తీసుకెళ్లి మరీ కేసులు: రాజధాని ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న తొలినాళ్లలో అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా చూడకుండా పోలీసులు ఇళ్లల్లోకి దూసుకెళ్లి, నిద్రపోతున్నవారిని తీసుకెళ్లి ఏవో ఒక కేసుల్లో ఇరికించారని రైతులు వాపోయారు. జాతీయ రహదారిని దిగ్బంధించినప్పుడు అటుగా వస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే, ఆయనపై దాడి చేశారని కేసులు నమోదు చేయడమే కాకుండా కొందరిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని రాజధాని జేఏసీ నేతలు చెబుతున్నారు.
నమ్మకద్రోహానికి నాలుగేళ్లు - రాష్ట్ర అభివృద్ధిని తలకిందులు చేసిన నిర్ణయం
ఇంటిముందు నినాదాలు రాశారంటూ: ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడంతో సీఆర్‌డీఏ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్లిన రైతులను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుపతికి, అలాగే అమరాతి నుంచి అరసవల్లికి రాజధాని రైతులు పాదయాత్ర చేపట్టినప్పుడు నిబంధనలు అతిక్రమించారంటూ వారిపై దారిపొడవునా ఏవో కేసులు పెడుతూనే ఉన్నారు. కరోనా సమయంలో రాజధాని రైతులు ‘అమరావతి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూనే ఎవరి ఇంటి ముందు వారు దీపాలు పెట్టుకున్నా, ముగ్గులు వేసుకున్నా, అమరావతి నినాదాలు ఇంటిముందు రాశారంటూ కేసులు నమోదు చేశారు.
మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న పోటీ శిబిరంలో పాల్గొనేందుకు రాజధాని గ్రామాలతో సంబంధంలేని బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆటోల్లో వస్తుంటే కృష్ణాయపాలెం వద్ద ఎస్సీ రైతులు వారిని అడ్డుకున్నారు. బయటి నుంచి వచ్చి మూడు రాజధానుల అనుకూల శిబిరంలో పాల్గనడం సరికాదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైసీపీకు చెందిన స్థానిక ఎస్సీ నాయకుడితో తమను కులం పేరుతో దూషించారంటూ 9 మందిపై ఫిర్యాదు చేయించారు. వారిలో 8 మంది ఎస్సీలు, ఒక బీసీ రైతు ఉన్నారు. అందరిపైనా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
YSRCP Government Ignored Amaravati Development : రాష్ట్ర ప్రజలనే కాదు.. అబద్ధాలతో వైసీపీ ప్రభుత్వం కోర్టులను సైతం మోసం..
చేతులకు బేడీలు వేసి ఉగ్రవాదుల్ని తరలించినట్టుగా గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఆ కేసులో వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న రైతుల్లో అనేక మంది నెలలో రెండు వారాలు కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతోంది. రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉండటంతో వారు ఏ కేసుల్లో ఉన్నారు. కోర్టు వాయిదాలు ఎప్పుడు, వాటిని గుర్తు చేసేందుకు, వారిని కోర్టులకు తీసుకెళ్లి హాజరుపర్చేందుకు అమరావతి జేఏసీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
పోలీసులపై ఒక్క కేసూ లేదు: రాజధాని రైతులపై అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడిన పోలీసులపై మాత్రం ఇంత వరకు ఒక్క కేసూ లేదు. మందడం గ్రామానికి చెందిన ఒక యువతిని పోలీసులు బూటు కాళ్లతో కడుపులో తన్నితే ఆమె తీవ్రంగా గాయపడి, విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో 15-20 రోజులు చికిత్స పొందారు. పోలీసులు గొంతు పట్టుకుని నులమడంతో ఒక మహిళ ఆరు నెలలపాటు మాట్లాడలేకపోయారు. పోలీసుల దాడుల్లో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఒక్క పోలీసుపైనా ప్రభుత్వం చర్య తీసుకోలేదు.
CM Jagan Plan to Destroy Capital Amaravati: అమరావతిని నాశనం చేసేందుకు మరో ప్లాన్.. గుట్టుగా కసరత్తు చేస్తున్న సీఆర్డీఏ అధికారులు