Supreme Court Hearing on Andhra Capital: రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం మార్చి 28న చేపట్టనుంది. తాము దాఖలు చేసిన పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ.. అమరావతి కేసుల అంశాన్ని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట రాష్ట్రప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సోమవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ కేసుల విచారణను ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టులో చేపట్టాల్సి ఉంది. అయితే ఒకసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో.. ఈనెల 23న జరగాల్సిన విచారణ వాయిదా పడిందని పేర్కొన్నారు. హోలీ సెలవుల అనంతరం వెంటనే పిటిషన్లపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. వెంటనే అంటే.. సాధ్యం కాకపోవచ్చని అన్నారు.
తర్వాత వారంలో కూడా అలాంటి పరిస్థితే దాదాపు ఉందని న్యాయమూర్తులు పేర్కొనగా.. ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని కోరారు. 400 పేజీలు పరిశీలించాల్సి ఉండడం, బహుముఖ అంశాలు ముడిపడి ఉన్నందున ఎక్కువ సమయం పడుతుందని జస్టిస్ కేఎం జోసెఫ్ తెలిపారు. తొలుత మార్చి 20, 21 తేదీల్లో విచారించాలనుకున్నా.. కుదరని పరిస్థితి ఉండటంతో.. మార్చి 28న విచారించనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అంతకు ముందు.. ఎంత సమయం వాదనలకు తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకరోజు పడుతుందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు.