గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని భవనం స్పిన్నింగ్ మిల్లుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు కార్మిక, కర్మాగారాల శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామన్నారు. కర్మాగారంలో 25మంది బాల కార్మికులను గుర్తించినట్లు జిల్లా కర్మాగారాల శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు తెలిపారు.
భవనం స్పిన్నింగ్ మిల్లులో బాల కార్మికుల గుర్తింపు... కేసు నమోదు..
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని భవనం స్పిన్నింగ్ మిల్లుపై అధికారులు కేసు నమోదు చేశారు. బాల కార్మికులతో పరిశ్రమలో పని చేయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక, కర్మాగారాల శాఖ, రెవెన్యూ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.
పద్నాలుగేళ్ల లోపు వారు నలుగురు, పద్దెనిమిదేళ్ల లోపు కార్మికులు 21 మంది ఉన్నట్లు చెప్పారు. చట్ట వ్యతిరేకంగా బాలలతో పనిచేయిస్తున్నందున కర్మాగారాల చట్టం కింద భవనం స్పిన్నింగ్ మిల్లుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ సుభాని, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు నాగకోటేశ్వర రావు, సమీర్ కుమార్, గుంటూరు దక్షిణ మండలం డీఎస్పీ ప్రశాంతి, మేడికొండూరు తహసీల్దార్ కరుణ కుమార్, సీఐ మురళీ కృష్ణ, ఫిరంగిపురం ఐసీడీఎస్ సీడీపీఓ ప్రసూన పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గుంటూరు మెడికల్ క్లబ్ ఎదుట వైద్యుల నిరసన