కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడానికి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో గుంటూరు జిల్లా నరసరావుపేటలోని లైఫ్ లైన్ ఆస్పత్రిపై కేసు నమోదైంది. బంధువుల సమాచారంతో విజిలెన్స్ అధికారులు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రూ. 4.60 లక్షలు వసూలు.. 2 లక్షలు డిమాండ్!
ఆ వ్యక్తి కొంత కాలంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లులో లారీ డ్రైవర్ పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. 15 రోజుల క్రితం దేవరాజుకు కరోనా సోకడంతో నరసరావుపేట పట్టణంలోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇప్పటి వరకూ సుమారు 4లక్షల 60 వేల రూపాయలు వైద్యశాలలో చెల్లించినట్లు బంధువులు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున దేవరాజు మృతి చెందాడని .. 2 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని వైద్యులు తెలిపారన్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు వైద్యశాలకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.