గుంటూరులో రమ్య హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రత్తిపాడులో ఆ పార్టీ నాయకులు స్థానికంగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. రహదారిపై రాస్తారోకో చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఎవరిపై కేసు నమోదు చేశారనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
లోకేశ్ బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకంత భయపడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. ఎస్సీలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు జరిగినప్పుడు మేరుగ నాగార్జున, నందిగం సురేశ్ ఎక్కడున్నారని నిలదీశారు. తనను కులంపేరుతో దూషించిన లేళ్ల అప్పిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నక్కా ఆనంద్ బాబుపై చేయి చేసుకున్న ఎస్పీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అసమర్థ ముఖ్యమంత్రి అని.. మంత్రి పదవులిస్తారనే ఆశతో వైకాపా నేతలు ఉన్నారని విమర్శలు చేశారు.