వసతి గృహాలంటే ఊరికి దూరంగా.. పాడుబడిన భవనాలే గుర్తుకొస్తాయి. అలాంటిది ఆ వసతి గృహానికి వెళ్తే.. పచ్చటి మొక్కలతో నిండిన ఉద్యానవనం స్వాగతం పలుకుతుంది. ఆవరణ చుట్టూ గోడలపై శాంతిని నెలకొల్పే బుద్ధుని బొమ్మలు మనసుకు అహ్లాదాన్ని పంచుతుంటే... యువతకు ఆదర్శనీయమైన వివేకానంద వంటి మహనీయుల చిత్రాలు ఉత్తేజాన్ని నింపుతాయి. పేద విద్యార్థుల వసతిగృహాన్ని ఉద్యానవనంలా మార్చేశారు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వసతి గృహం సంరక్షణాధికారి శివశంకర ప్రసాద్. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కల పెంపకంలో భాగస్వాములను చేస్తున్నారు.
పిల్లల బంగారు భవితకు బాటలు వేస్తూ..
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో చేశాం అన్నట్టు కాకుండా.. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పి, జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా బాటలు వేస్తున్నారు శివశంకర్ ప్రసాద్. వసతి గృహం చుట్టూ వివిధ మొక్కలతో పాటుగా, కొన్ని అరుదైన మొక్కలను పెంచుతూ వాటిని సంరక్షిస్తున్నారు. ఆకు కూరలు, కూరగాయలు పండిస్తూ.. వాటితోనే భోజనం వండి వడ్డిస్తున్నారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులను పచ్చని వాతావరణంలో కూర్చోబెట్టి చదివిస్తూ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు.