ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతివేగం... ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది!

పెళ్లి జంటను ఆశీర్వదించి సంతోషంగా ఇళ్లకు వెళ్తున్న వారిని ప్రమాదం చిదిమేసింది. బంధు, మిత్రులతో సరదాగా గడిపిన ఆనంద క్షణాలు అంతలోనే ఆవిరయ్యాయి. గమ్యం చేర్చాల్సిన వాహనం ఆరుగురిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. టవేరా వాహనం మితిమీరిన వేగంతో రోడ్డు పక్కనున్న వాగులోకి దూసుకెళ్లి ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

గుంటూరు జిల్లాలో కారు బోల్తా...ఐదుగురు మృతి
గుంటూరు జిల్లాలో కారు బోల్తా...ఐదుగురు మృతి

By

Published : Mar 1, 2020, 5:30 PM IST

Updated : Mar 2, 2020, 5:07 AM IST

అతివేగం... ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది!

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాకుమానుకు చెందిన 11 మంది ఏటుకూరులో ఓ శుభకార్యానికి వెళ్లారు. బంధుమిత్రులతో సరదాగా గడిపారు. కార్యక్రమం అనంతరం టవేరా వాహనంలో ఇంటికి తిరుగుపయనమయ్యారు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. పుల్లడిగుంట వద్ద వాగులోకి దూసుకెళ్లింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. టవేరా వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన వారిని రమణమ్మ, సీతమ్మ, వరలక్ష్మి, ప్రసాదం, కమాదుల శ్రీనివాసరావు, సుబ్బమ్మగా గుర్తించారు. ఏం జరుగుతోందో అర్థం కాక క్షతగాత్రులు గుండెలవిసేలా రోదించారు.

అతివేగం... మద్యం మత్తు

ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ కమాదుల శ్రీనివాసరావు మద్యం మత్తులో వేగం పెంచటంతో కారు అదుపుతప్పి 30 అడుగుల లోతులో ఉన్న వాగులోకి పల్టీలు కొట్టుకుంటూ పడిపోయింది. ప్రమాద సమయంలో కారు 130- 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని సమాచారం. మృతులు, క్షతగాత్రులు కూలిపని చేసుకుని జీవనం గడిపేవారని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులంతా దగ్గరి బంధువులే కావటంతో కాకుమానులో విషాదం నెలకొంది. బాధితులు, వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యారు.

పరిహారం ప్రకటన

మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత భరోసా ఇచ్చారు. జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Last Updated : Mar 2, 2020, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details