రాజధానిలో రైతులు, మహిళల వినూత్న నిరసన రాజధాని గ్రామాల్లో అమరావతి ఉద్యమం 84వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, రాయపూడి, పెదపరిమి, యర్రబాలెంలో ధర్నాలు, నిరాహార దీక్షలతో రైతులు తమ నిరసన తెలిపారు. తమ గ్రామాల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని... ఓటు ద్వారా తమ అభిప్రాయం తెలిపే అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ మందడం రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ బతుకులను సర్కారు రోడ్డున పడేసిందని, అందరికీ అన్నం పెట్టే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ కంచాలు, గరిటెలు మోగించారు.
కళ్లకు గంతలతో వినూత్న నిరసన
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని... ఇక తమకు న్యాయదేవతే అండగా నిలవాలని కోరుకుంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు వినూత్న ప్రదర్శన చేశారు. కళ్లకు గంతలతో న్యాయదేవత రూపంలో ఓ మహిళా రైతు ధర్నా శిబిరంలో నిలబడగా... మిగతా రైతులు, మహిళలు అమరావతిని రాజధానిగా కొనసాగాలని ఆమెను అభ్యర్థిస్తున్నట్లు ప్రదర్శన చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ తమ పోరాటం సాగుతుందని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
స్థానిక సంగ్రామంలో కలిసి.. మెలిసి..!