Capital Farmers Problems : రాజధాని రైతుల్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల పేరిట రైతుల్ని నాలుగేళ్లుగా రోడ్డున పడేసిన వైఎస్సార్సీపీ సర్కారు ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ఆలస్యం చేస్తోంది. రైతులు తమ భూమి పత్రాలు తెచ్చి సీఆర్డీఏ కార్యాలయంలో చూపించాలని నిబంధన పెట్టింది. భూసమీకరణకు ఇచ్చినప్పుడు, సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నప్పుడు ధృవపత్రాల్ని ఇచ్చామని మళ్లీ ఇప్పుడు వాటిని తీసుకురావాలని చెప్పటం వేధించటమేనని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం 34,385 ఎకరాలను సమీకరించింది. రైతులు భూములు ఇచ్చినందుకు మెట్ట భూములకు ఎకరాకు రూ.39వేల చొప్పున, జరీబు భూములకు ఎకరాకు రూ.50వేల చొప్పున వార్షిక కౌలు ఇస్తామని చెప్పింది. పదేళ్ల పాటు ఏటా పది శాతం పెంపుతో కౌలు ఇచ్చేలా సీఆర్డీఏ రైతుల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారంలో కౌలు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయాలి. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌలు చెల్లించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌలు విషయంలో ఆలస్యం చేస్తోంది. రైతులు ప్రతిసారి కోర్టుని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈసారి కూడా ఇంకా కౌలు డబ్బులు రాలేదు.
దీంతో రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కౌలు సొమ్ములు ఎందుకు వేయటం లేదని కొందరు రైతులు విజయవాడలోని సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి అడిగారు. రైతులు తమ భూములకు సంబంధించిన ధృవపత్రాలు చూపించాలని, జిరాక్సులు అందజేయాలని చెప్పారు. భూ సమీకరణ సమయంలోనే అన్నిరకాల పత్రాలు చూశాకే వాటిని సీఆర్డీఏ తీసుకుంది. అలాగే ధృవపత్రాల జిరాక్సులను రైతులు ఇచ్చారు. ఏడేళ్ల పాటు కౌలు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ పత్రాలు చూపించాలని చెప్పటం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అందులో 25శాతం భూమి సీఆర్డీఏ ప్లాట్ల రూపంలో తిరిగి ఇచ్చింది. మొత్తం 63 వేల 462 స్థలాల్ని సీఆర్డీఏ అధికారులు రైతులకు కేటాయించారు. వాటిలో 42,524 ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారిని కూడా ఆ పత్రాలు తెచ్చి చూపాలని సీఆర్డీఏ చెప్పటంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Pawan met with Farmers Workers: రైతులకు రాజకీయాలకతీతంగా అండగా ఉంటా: పవన్