ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్‌ విభాగం - guntur latest news

క్యాన్సర్‌ చికిత్స అంటే మాటలు కాదు. వ్యాధి నిర్ధరణ పరీక్షల నుంచి చికిత్సకు వాడే పరికరాలు, మందుల వరకు అంతా రూ.లక్షల్లోనే వ్యయం అవుతుంది. ధనవంతులు కూడా కొన్నిసార్లు భరించలేని స్థితి. ఇక పేద, మధ్య తరగతి ప్రజల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించేందుకు గుంటూరు సర్వజనాసుపత్రిలో క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Cancer treatment at Guntur GGH
గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్‌ విభాగం

By

Published : Jun 27, 2020, 7:30 AM IST

క్యాన్సర్​ వచ్చిందంటే చాలు... ధనవంతుడి నుంచి సామాన్యుడి వరకు వణికిపోతారు. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్న వైద్యం. వ్యాధి నిర్ధరణ పరీక్షల నుంచి చికిత్సకు వాడే పరికరాలు, మందుల వరకు అంతా రూ.లక్షల్లోనే వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించేందుకు గుంటూరు సర్వజనాసుపత్రిలో నూతనంగా క్యాన్సర్‌ విభాగాన్ని రూ.33 కోట్ల వ్యయంతో నాట్కో ట్రస్టు నిర్మించింది. అత్యాధునిక పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వమూ రూ.17 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ వార్డును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జులై ఒకటిన ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో తొలిసారి...

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాసుపత్రిలో లేనివిధంగా 100 పడకలతో సెల్లార్‌, జి+3 అంతస్తులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. శీతలీకరణ యంత్రాలు, ఫర్నీచర్‌, విద్యుత్తు పరికరాలతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ నాట్కో ట్రస్టు సమకూర్చింది. భవనాన్ని నాట్కో ఫార్మా లిమిటెడ్‌ సీఎండీ వీసీ నన్నపనేని... సీఎం సమక్షంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కి అప్పగించనున్నారు.

ఇకపై నవ్యాంధ్రకు రిఫరల్‌ ఆసుపత్రి...

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రి రిఫరల్‌ హాస్పిటల్‌గా ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో క్యాన్సర్‌ చికిత్సకు అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి లేనందున రోగులకు ఇబ్బందిగా ఉండేది. సర్వజనాసుపత్రిలోని క్యాన్సర్‌ విభాగం ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రోగులకు ఉచితంగా సేవలు అందించనుంది.

త్వరలో మరిన్ని పరికరాలు...

కార్పొరేట్‌ ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఇంకొన్ని అత్యాధునిక పరీక్షలు త్వరలో సర్వజనాసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. బ్రాకీథెరపీ, డిజిటల్‌ మామోగ్రామ్‌, ఆపరేటింగ్‌ మైక్రోస్కోప్‌, పెట్‌స్కాన్‌ వంటి అత్యాధునిక క్యాన్సర్‌ నిర్ధరణ యంత్రాలను ప్రభుత్వం సమకూర్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్‌ వార్డును నిర్మించినందున పీజీ కోర్సులో ఎండీ(రేడియేషన్‌ ఆంకాలజీ)తోపాటు మెడికల్‌, సర్జికల్‌ ఆంకాలజీల విభాగాలను ప్రారంభించడానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

రూ.13 కోట్ల విలువైన రేడియేషన్‌ థెరపీ యంత్రం

రేడియేషన్‌ థెరపీ ఇచ్చేందుకు అత్యంత ఆధునిక యంత్రం... లీనియర్‌ యాక్సిలేటర్‌ను ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ స్విట్జర్లాండ్‌ నుంచి రూ.13 కోట్ల వ్యయంతో తెప్పించింది.

ఇవీ చదవండి:అమానవీయం..కరోనా మృతదేహం జేసీబీతో శ్మశానానికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details