FARMERS FACING PROBLEMS DUE TO HORSESHOES: గుంటూరు జిల్లాలోని జాగర్లమూడి నుంచి వట్టిచెరుకూరు మండలం మీదుగా కాకుమాను మండలానికి అప్పాపురం ఛానల్ 43 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఈ కాల్వ ద్వారా 25 వేల ఎకరాల ఆయకట్టు సాగు చేస్తున్నారు. అయితే వట్టి చెరుకూరు దిగువ ప్రాంతం నుంచి కాకుమాను వరకు అప్పాపురం ఛానల్ గుర్రపుడెక్కతో నిండిపోయింది. ఎటు చూసినా, ఎక్కడ కాలు పెట్టినా గుర్రపుడెక్కే దర్శనమిస్తోంది. ఒక్క చుక్క నీరు కూడా కాల్వలో కనిపించడం లేదు.
దాదాపు 18 వేల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఎకరానికి 2 నుంచి 3 గంటల్లో నీరు పెడతారు. ఇప్పుడు ఒక ఎకరం పొలం తడపాలంటే రాత్రింబవళ్లు ఎదురుచూపులు తప్పడం లేదు. కాల్వలో కొంచెం నీరు కనిపించగానే రైతులు పొలాలకు ఇంజన్ స్టార్ట్ చేస్తున్నారు. మోటర్ పెట్టిన అరగంటలోనే ఆ కొద్దిపాటి నీరు కూడా అయిపోతుంది. తిరిగి నీటి జాడ వచ్చే వరకు ఎదురుచూపులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
"అప్పాపురం ఛానల్లో గుర్రపుడెక్క నిండుకోవడం వల్ల 15 రోజుల నుంచి నీరు రావడంలేదు. ఉన్న నీరు ఇంజన్లకు అందడం లేదు. ఒక్క తడి వేసుకుంటే పెసర పండిద్దామనుకుని ఎంత కష్ట పడ్డ దానికి కూడా నీరు రావడం లేదు. ఈ కాల్వలో ఉన్న గుర్రపు డెక్క తీసేస్తే కానీ నీరు రాదు"-కోటిరెడ్డి, వల్లూరు రైతు