Campus Recruitment in IT Sector: రాష్ట్రంలో ఐటీ రంగంలో 25 ఏళ్ల తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో ప్రాంగణ నియామకాలు తగ్గాయి. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినా.. కంపెనీలు నియామకాలను చేపడుతున్న దాఖలాల్లేవు. ఎక్సెంచర్, వర్చుసా, ఐబీఎం, కొన్ని స్టార్టప్ సంస్థలు.. అరకొరగా నియామకాలు చేపట్టాయి. ఎల్‌అండ్‌టీ, మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్ సంస్థలు నియామకాలపై ఇంతవరకూ ఇంజినీరింగ్ కళాశాలలకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు.
హెచ్‌సీఎల్, విప్రో సంస్థలు.. కొన్ని కళాశాలల నుంచి డేటా తీసుకున్నా.. నియామకాలకు వచ్చేదీ.. లేనిదీ.. చెప్పలేదు. టీసీఎస్ జనవరిలో కళాశాలలకు వస్తుందని.. అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో జులై నుంచి ప్లేస్‌మెంట్ల ప్రక్రియ మొదలై అక్టోబరుతో ముగుస్తుంది. ఏవో కొన్ని కంపెనీలు మాత్రం జనవరి దాకా నియామకాల్ని చేస్తుంటాయి. కానీ.. ఈసారి ఆ వాతావరణమే కనిపించడం లేదు.
తగ్గిన క్యాంపస్ ప్రాంగణ నియామకాలు..పెరిగిన ఐటీ కోర్సులు
Reduced campus placements in AP: విశాఖపట్నంలోని ఓ కళాశాల ఏటా 2 వేలకు పైగా ఉద్యోగాలకు ఆఫర్ లెటర్లు పొందుతోంది. ఈ ఏడాది మాత్రం 250 మాత్రమే వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడలోని ఓ కళాశాలకు గతేడాది 1,100 ఆఫర్ లెటర్లు రాగా.. ఈసారి ఆ సంఖ్య 500 దాటలేదు. గుంటూరులోని ఓ ముఖ్య కళాశాలలో గతేడాది 1,200 మంది ఆఫర్ లెటర్లు పొందారు. ఈసారి 200 మందికే కొలువులు దక్కాయి.
రాయలసీమలోని ఓ ప్రముఖ కళాశాలలో గతేడాది 90 శాతం ప్రాంగణ నియామకాలు ఉండగా.. ఈసారి 25 శాతమే లభించాయి. ఏఐసీటీఈ గణాంకాలు చూసినా.. రాష్ట్రంలో ఈసారి ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గాయి. 2019-20లో ఇంజినీరింగ్ కళాశాల్లలో ప్రవేశాలు.. 92 వేల 865 ఉండగా.. 48,064 మంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు.