Cabinet Sub Committee on Bhu Hakku Bhu Raksha Scheme: రాష్ట్రంలో భూహక్కు-భూరక్ష పథకం మూడో దశను 2024 జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. సచివాలయంలో భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు బొత్స, ధర్మాన, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వేపై మంత్రుల కమిటీ సమీక్షించింది. ఇప్పటి వరకు రెండు దశల్లో సర్వే పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. మొదటి, రెండో దశల్లో మొత్తం నాలుగు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూహక్కు పత్రాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 72 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్లను కూడా పంపించినట్టు వెల్లడించారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పరిధిలో 15.02 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందన్నారు. మూడో దశ నాటికి నాలుగు యూఎల్బీల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పని చేయాలని ఆదేశించారు.