గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం చెత్తకుప్పలో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా.. గోనెసంచిలో చుట్టి కాలిపోయి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.
మరణించిన వ్యక్తి వయసు 27 నుంచి 30 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే కార్మికుడు లేదా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల డ్రైవర్ అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై శ్రీహరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.