ఓవైపు మృతదేహం బరువు... మరోవైపు వర్షం కారణంగా బురదమయంగా మారిన పొలం గట్లు. శవంతో పాటే ఎక్కడ జారిపడతారేమో అనే భయం. శ్మశానానికి వెళ్లేందుకు వేరే దారి లేక... ఏళ్ల తరబడి ఆ గ్రామస్తులు నరకాన్ని చూస్తున్నారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రబాలెం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతన ఇది. పూర్వం గ్రామానికి చెందిన కొందరు దాతలు శ్మశానానికి భూమి విరాళంగా ఇచ్చారు. అప్పటినుంచి ఆ స్థలంలోనే దహన సంస్కారాలు నిర్వహించేవారు.
అప్పట్లో మెట్టుభూమి కావడం కారణంగా ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదు. కాలక్రమేణా ఈ భూమి మాగాణిగా మారడంతో ఒక్కసారిగా విలువ పెరిగింది. శ్మశానానికి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. కొంత భూమిని తమ పొలంలో కలిపేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇక శ్మశానానికి కొద్దిపాటి స్థలమే మిగిలింది. శ్మశానానికి వెళ్లే దారులూ మూసుకుపోయాయి. ఆక్రమణలు తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.