Building Construction Workers: జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భవన నిర్మాణ కార్మికులను అతలాకుతలం చేసేస్తోంది. కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వచ్చీ రాగానే 'కొత్త ఇసుక విధానం' పేరుతో రీచ్‌లు మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేసింది. నిర్మాణ పనులు ఆగిపోయేలా చేసి, కార్మికుల కడుపు కొట్టింది. నిర్మాణ సామగ్రి ధరలు, ఇతర ఖర్చు పెరగడం, వ్యాపారం మందగించి పనులు లేక కూలీల కుటుంబం గడవటమే కష్టంగా మారింది.
పనుల్లేని కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వని ప్రభుత్వం భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న నిధులను ఇతర వాటికి మళ్లించేస్తోంది. గతంలో వీరి కోసం ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలను ఎత్తేసింది. నవరత్నాల్లో కలిపేసి ఏవీ అందకుండా చేసింది. కార్మికుల సంక్షేమ బోర్డునూ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న పన్ను నిధులను వైఎస్సార్ బీమాకు వాడేసుకుంటోంది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా వారికి బోర్డు ఇచ్చే ప్రయోజనాలను కొనసాగించాయి. కానీ జగన్ అనాలోచిత నిర్ణయాలతో పస్తులుండాల్సి వస్తోందదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేసే ఒక శాతం పన్ను డబ్బులతో ప్రభుత్వం కార్మికులకు సంక్షేమాన్ని అమలు చేయాలి? కానీ, నవరత్నాలు ఇస్తున్నామంటూ ఆ డబ్బులను ఇతర పథకాలకు వాడేస్తోంది.
టీడీపీ హయాంలోని పథకాలను వైసీపీ నిలిపివేసింది: భవన నిర్మాణ కార్మికులు
గత నాలుగేళ్లుగా వైఎస్సార్ బీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నిధులు వాడుకోగా ఈ ఏడాది ప్రీమియం చెల్లిచకుండా పరిహారం డబ్బులను ఈ నిధులతోనే బాధితులకు చెల్లిస్తోంది. ప్రీమియానికి, పరిహారం చెల్లింపునకు మధ్య వ్యత్యాసం లేకపోవడంతో ప్రీమియం చెల్లించకుండా నేరుగా క్లైయిమ్స్ చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ బోర్డులో 19లక్షల 96వేలకు పైగా కార్మికులు నమోదయ్యారు. వీరిలో నవరత్నాల కింద లబ్ధి పొందుతున్న వారు 15 లక్షలలోపే. ఈ లెక్కన దాదాపు 5లక్షల మందికి అటు నవరత్నాలు, ఇటు బోర్డు సంక్షేమ పథకాలూ అందడం లేదు.
చట్టం ప్రకారం అందించాల్సిన వాటినే ఎగ్గొటే సీఎం జగన్ ప్రతి సభలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు. బోర్డుకు సంబంధించిన పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఎవరు చనిపోయినా సంక్షేమ బోర్డు నుంచి బీమా పరిహారం వస్తుంది. కానీ, వైఎస్సార్ బీమాలో కుటుంబ పెద్ద చనిపోతేనే బీమా ఇస్తారు.