గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో అక్కాతమ్ముళ్లైన భూలక్ష్మి, కృష్ణమూర్తి ఉంటున్నారు. భూలక్ష్మికి పిల్లలు లేకపోవటంతో కృష్ణమూర్తి దగ్గరే ఉంటోంది. గత పదిహేనేళ్లుగా కృష్ణమూర్తి రేచీకటితో బాధపడుతున్నాడు. ఈ మధ్య షుగర్ వ్యాధి తోడైంది. దానికితోడు అతని కుమారుడికి మతిస్తిమితం సరిగ్గాలేదు. ఆ కుటుంబాన్ని కృష్ణమూర్తి భార్య పండ్లు అమ్ముతూ పోషిస్తోంది.
ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న కృష్ణమూర్తి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం అక్కతో పంచుకున్నాడు. అందుకు ఆమె 'ఇద్దరం కలిసే బతికాం.. కలిసే చనిపోదాం' అంటూ అతనితో చెప్పింది. అయితే వీరి మాటలు విన్న కుటుంబసభ్యులు వారిని ఓదార్చారు... ధైర్యం చెప్పారు. అయినప్పటికీ వారి నిర్ణయం మారలేదు. శుక్రవారం ఉదయం కాలవగట్టు వద్దకు దీపారాధన చేసేందుకు వెళ్తున్నామని చెప్పి.. గుంటూరు ఛానల్లో దూకి బలవన్మరణం చెందారు. వారికోసం వెతుకులాట ప్రారంభించిన కుటుంబ సభ్యులకు విగతజీవులై కనిపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.