శిథిలావస్థకు చేరిన వంతెన.. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి.. పట్టించుకోని ప్రభుత్వం..! Bridge in Worst Condition in Krishnayapalem: అసలే ఇరుకు వంతెన.. అది చాలదన్నట్లు పడిపోయిన రెయిలింగ్.. తుప్పపట్టి బయటకు చొచ్చుకు వచ్చిన ఇనుప కమ్మీలు.. మొత్తంగా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న ఈ వంతెన.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలోనిది. విజయవాడ వైపు నుంచి రాజధాని అమరావతికి వచ్చే వాహనాలన్నీ ఈ మార్గంలోనే రావాలి. నిత్యం వేలాది వాహనాలు ఈ వంతెన పై నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి.
స్థానికులే కాకుండా సచివాలయ ఉద్యోగులు, అధికారులు, హైకోర్టు న్యాయవాదులు నిత్యం ఇదే దారిలో ప్రయాణం సాగిస్తుంటారు. అంతటి కీలకమైన రహదారిలో ఈ వంతెన వద్దకు వచ్చేసరికి భయం భయంగా ప్రయాణిస్తుంటారు. ఇటీవల రాజధానిలో ప్లాట్ల పంపిణీకి వచ్చిన ముఖ్యమంత్రికి.. వంతెన దుస్థితి కనపడకుండా ఫ్లెక్సీలు కట్టారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
"ఈ వంతెన 40 సంవత్సరాల క్రితం డా.ఎమ్ఎస్ కోటేశ్వరరావు ప్రోద్బలంతో నిర్మించారు. కానీ ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ నుంచి సచివాలయం, అమరావతి వెళ్లాలంటే ప్రధాన రహదారి ఇది. మొన్న ఈ కాలువలో ఇద్దరు పడిపోతే.. స్థానికులు కాపాడారు. ఈ ఐదు సంవత్సరాల నుంచి వంతెనను పట్టించుకున్న వారు లేరు."-స్థానికులు
వంతెన వెడల్పు కూడా తక్కువగా ఉండటంతో రెండు వైపులా వచ్చే వాహనాలు ఒకేసారి వంతెనపై నుంచి వెళ్లలేవు. ఏదో ఒకవైపు వాహనాలు ఆగిపోవాల్సిందే. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఇక్కడ కొత్త వంతెన నిర్మించటం లేదు. కనీసం పాడైపోయిన వంతెనకు మరమ్మత్తులు చేయటం లేదు. వంతెనకు అటూ ఇటూ ఉన్న రెయిలింగ్ కూడా కొన్నిచోట్ల ధ్వంసమైంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనంతో సహా పక్కనే ఉన్న వాగులోకి పడిపోయే ప్రమాదముంది. ఇటీవల కొన్ని ప్రమాదాలు జరిగాయని.. అయినా అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాహనదారులు విమర్శిస్తున్నారు.
"మేము ఏ పని మీద బయటికి వెళ్లినా ఈ వంతెన మీద నుంచే వెళ్లాలా. ఎదురు బస్సు వస్తే.. వాగులో పడటమే. సచివాలయానికి, అమరావతి ప్రాంతానికి ప్రతిరోజూ వందల మంది వెళ్తుంటారు. ఈ దారిలో మెట్రో బస్సులు ఎక్కువ తిరుగుతాయి. ఒక్క నిమిషం కన్ను మూసినా ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ దీనిని పట్టించుకున్న వారు లేరు. దీనిని బాగు చేస్తే చాలా మందికి ఇబ్బంది తొలగిపోతుంది."-స్థానికులు
అమరావతికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని.. అంత డబ్బు లేదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. కనీసం ఇక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందనే విమర్శలున్నాయి. కృష్ణాయపాలెం వంతెన శిథిలమైనా పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.