ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చంద్రబాబుతో పాటు తెదేపా నేతలు.. తమ ప్రభుత్వాన్ని నిందించటం సరికాదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో అచ్చెన్నాయుడుకు చికిత్స అందిస్తున్నారని... ఆయన్ను కలవాలంటే కోర్టు అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయం తెలియకుండా ప్రభుత్వాన్ని చంద్రబాబు నిందించటం సరికాదన్నారు.
అరెస్టు అన్యాయం అని మాట్లాడుతున్న చంద్రబాబు... అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చెప్పలేకపోయారని బొత్స అన్నారు. రూ.150 కోట్ల అవినీతిలో చంద్రబాబు, లోకేశ్ కు వాటా ఉందని ఆరోపించారు. అందుకే అసలు విషయం పక్కన పెట్టి.. అరెస్టు అన్యాయమని మాట్లాడుతున్నారని విమర్శించారు. మందుల కొనుగోలు అవినీతికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.