National Award for Borabanda UPHC: జ్వరమొస్తే మందులు ఇవ్వడం, నొప్పులకు సూదిమందు. వివిధ రకాల వ్యాధులతో.. ఆస్పత్రికి వచ్చే వారికి నాణ్యమైన, ఇన్‌ఫెక్షన్ రహిత వైద్యసేవలతోపాటు రోగికి సంతృప్తికరమైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది తెలంగాణ రాష్ట్రం బోరబండలోని బోరబండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. రోగులకు మంచినీరు సహా అవసరమైన అన్నిరకాల పరీక్షలు ఉచితంగా చేయటం సహా.. రోగి సహాయకులు కూర్చుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. చిన్నారులకు సమయానుకూలంగా టీకాలు అందించడంతోపాటు అన్ని రకాల జాతీయ ఆరోగ్య మిషన్ పథకాలు అమలు చేస్తూ ఔరా అనిపిస్తోంది.
ఈ యూపీహెచ్సీలోకి అడుగుపెడితే ప్రశాంత వాతావరణం రోగికి స్వాంతన కలిగిస్తుంది. నిత్యం వందకు పైగా మంది ఓపీ సేవలకోసం వస్తున్నా.. అందరికీ క్యూలైన్లు, పరీక్షాకేంద్రాలు సహా ఏ వైద్యం ఎక్కడ అందిస్తారో చెప్పే ప్రత్యేక సూచికా బోర్డులు ఏర్పాటు చేశారు. బాలింతలు ఆస్పత్రికి వస్తే చిన్నారులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేశారు. వాటితోపాటు ఆస్పత్రి ప్రాంగణంలోని మెడిసినల్ ప్లాంట్స్, గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
వివిధ వ్యాధులతో బాధపడేవారు.. నిత్యం గార్డెన్‌లో కాసేపు సేద తీరుతుంటారు. మధుమేహ రోగులకు కావాల్సిన మందులు అందించటం సహా ఆయుష్ వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచటం, సిరంజీలు, నీడిల్స్ సహా మెడికల్ వ్యర్థాలు సరిగ్గా డిస్పోజ్ చేయటం వంటివి చేస్తున్నారు. మెరుగైన సేవలు అందిస్తుండటంతో ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్స్ అవార్డుకు ఎంపికైంది బోరబండ యూపీహెచ్సీ.