Bopparaju Venkateshwarlu: పదవి విరమణ ప్రయోజనాల కోసం యూనివర్శిటి ఉద్యోగులు కోర్టుకు వెళ్లాల్సి రావటం బాధాకరమని ఏపీ జేఏసీ-అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరులోని లాంలో జరిగిన ఏపీ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం సదస్సులో ఆయన పాల్గొన్నారు. యూనివర్శిటి ఉద్యోగుల పెన్షన్లు, జీతభత్యాలు, పదవి విరమణ ప్రయోజనాలకు డబ్బులు లేకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
యూనివర్శిటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులెవరూ ప్రభుత్వం తీర్చలేని కోరికలు అడగటం లేదన్నారు. అప్పట్లో చర్చల్లో అంగీకరించినవి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులపై కొందరు తప్పుడు ప్రచారం ఆపాలన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల వారు గవర్నర్ వద్దకు వెళ్లారని... దానివల్ల నష్టం జరుగుతుందేమోనని భయంగా ఉందని ఆందోళనను వెలిబుచ్చారు.