మార్గదర్శిపై కక్షసాధింపులో భాగంగానే జగన్ దాడులు చేయిస్తున్నాడు: బొండా ఉమా Bonda Uma comments on CM Jagan: మార్గదర్శి సంస్థపై జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపులో భాగంగానే దాడులు చేయిస్తున్నాడని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మండిపడ్డారు. రామోజీరావుపై కక్షసాధింపులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల తీర్పునకు వ్యతిరేకంగా మార్గదర్శిపై ఏకపక్ష దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ పన్నులు రూపేణా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న సంస్థపై అనేక కుట్రలు పన్ని అందులో భాగంగానే వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పద్మవిభూషణ్ గౌరవం ఉన్న వ్యక్తికి ఇచ్చే మర్యాద ఇదేనా అని నిలదీశారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే దాడులు..ఒక్క ఫిర్యాదు కూడా లేని సంస్థపై కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి తప్పుడు పత్రికా ప్రకటనలు ఇచ్చే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపు కోసం సీబీసీఐడీని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. 1960 నుంచి ఈ రోజు వరకూ మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని గుర్తుచేశారు. చందాదారులకు నోటీసులు ఇచ్చి వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించి.. మార్గదర్శి సంస్థపై తప్పుడు ఫిర్యాదులు చేసే విధంగా వారిని వేధిస్తున్నారని ఆరోపించారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం పక్క రాష్ట్రాలకు ఎలా వెళ్లింది..వాలంటీర్లద్వారా జరిగిన వ్యక్తిగత సమాచార చౌర్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవయ్యిందని ఉమా విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో అమలు చేస్తున్న.. ఈ విధానం వల్ల ప్రజల ఆస్తులు, ధన, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఐదున్నర కోట్ల మందికి చెందిన డేటా దుర్వినియోగం వల్ల.. వైసీపీ బ్యాచ్ ఇప్పటికే 50 వేల కోట్ల పేదల భూములు కాజేసిందని ఆరోపించారు. విదేశాలకు డేటా అమ్ముకోవడం ద్వారా వేల కోట్లు సంపాదించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.
సేకరించి జీవితాలతో ఆడుకుంటున్నారు..రాష్ట్రంలో ప్రజల గోప్యతకు ఎక్కడా రక్షణ లేదని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పథకాల పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలిముద్రలు సేకరణ ద్వారా బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బుకు గ్యారెంటీ లేదన్నారు. వ్యక్తిగత సమాచారం పక్క రాష్ట్రంలో ప్రయివేటు వ్యక్తులు చేతుల్లో పెట్టటంపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ప్రశ్నిస్తే రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ చేస్తున్న డేటా చౌర్యంపై కోర్టుకు వెళ్తామని తెలిపారు.