Bonda Uma Fire on Jagan: అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రూ.3లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి.. ఇక దోపిడీ చాలన్నట్లుగా మంత్రివర్గంలో వేదాలు వల్లించాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. మీడియా అవినీతిని వెలికితీస్తున్నందున జాగ్రత్తపడాలని మంత్రులకు సూచించిన సీఎం, తన దోపిడీని మాత్రం కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై జరిగే దోపిడీ మీడియాకు తెలియకుండా చేయాలని సీఎం అమాత్యులకు సూచించారని విమర్శించారు.
గ్రీన్ ఎనర్జీలో రూ.60వేల కోట్లు, తూ.గో జిల్లాలో విక్రాంత్ రెడ్డి, అనీల్ రెడ్డి కలిసి రూ.15వేల కోట్ల లాటరైట్, విజయసాయి, జే గ్యాంగ్ కలిసి విశాఖలో రూ.40వేలకోట్ల భూములు దోచేశారని మండిపడ్డారు. మరో రూ.25వేల కోట్లు ఇతర నేతలు దోచారని విమర్శించారు. ఇసుకలోనే రూ.10వేల కోట్లు, 25వేల కోట్లు మైనింగ్‌లో, మద్యంలో రూ.25 వేల కోట్లు, మాదకద్రవ్యాల్లో రూ.21వేల కోట్లు, బియ్యంలో రూ.7వేల కోట్లు దోచేశారన్న బొండా.. సిమెంట్ మాఫియా సిండికేట్‌లో రూ.15వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.