రక్తదానం అన్నదానం కంటే గొప్పదంటారు. ఆపదలో ఉన్న మనిషికి రక్తం అందించడం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వల్ల మిగతా అన్ని రంగాల మాదిరిగానే రక్త సేకరణ మందగించింది. కరోనా భయంతో రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం చాలా చోట్ల లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా రక్తం ఇచ్చేందుకు దాతలు భయపడుతున్నారు.
తలసేమియా వంటి కొన్ని రోగాలకు, సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరిగేటప్పుడు, హృదయ సంభంధిత శస్త్రచికిత్సలకు రక్తం కీలకం. గుంటూరు జిల్లాను తీసుకంటే రక్త నిల్వలు నిండుకున్నాయి. అవసరానికి సగం మాత్రమే లభ్యత ఉండగా.. సేకరణా తగ్గింది. ఏటా జూన్ నెలలో నెలకు 400 ప్యాకెట్ల వరకు రక్తం లభ్యమయ్యేది. ప్రస్తుతం 200 ప్యాకెట్ల లభ్యత కూడా లేదు. రెడ్ క్రాస్ సౌసైటీ, మద్యపాన నిషేధ ప్రచార కమిటీ సభ్యుల చొరవతో కొంతమేరకు రక్తం లభించింది. లాక్డౌన్ ఎత్తేశాక ప్రమాదాలు పెరిగి రక్తానికి మళ్లీ డిమాండ్ పెరిగింది..
కరోనా వైరస్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ప్రజలు భయపడకుండా రక్తదానానికి ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కు, శానిటైజేషన్, స్టెరిలైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకుంటూనే రక్తాన్ని సేకరించవచ్చని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
ఇంతకు ముందు రక్తం ఎలా ఇచ్చారో.. ఈ కరోనా కాలంలోనూ అలానే ఇవ్వండి. దానివల్ల ఏం నష్టం లేదు. మేం బ్లడ్ తీసుకునేటప్పుడు అన్ని పరీక్షలు చేస్తాం. మాస్కులు, శానిటైజేషన్, స్టెరిలైజేషన్ ప్రక్రియలు పాటిస్తాం. లాక్ డౌన్ కారణంగా రక్తం కొరతగా ఉంది. అందుకే దాతలు స్పందించి రక్తదానం చేయాలని కోరుతున్నాం.