భాజపా పదాధికారుల సమావేశానికి గుంటూరు కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యనేతలు రాంమాధవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల బాధ్యులు సమావేశానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి.. సమావేశంలో పాల్గొంటారు.
కమలం పెద్దలు.. గుంటూరుకు వస్తున్నారు - మోదీ
గుంటూరులో ఆదివారం భాజపా పదాధికారుల సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలు రామ్ మాధవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్నారు.
దేశ వ్యాప్తంగా భాజపా సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యతలను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సభ్యత్వ నమోదు తీరు తెన్నుల్ని పరిశీలించడమే కాక... ఎక్కువ మందిని పార్టీలో చేర్పించటంపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. అలాగే పార్టీలో చేరికల అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఈ వ్యవహారాలు చూస్తున్నారు.
ఇటీవలి కాలంలో పలువురు తెదేపా నేతలు పార్టీలో చేరారు. రేపు కొందరు ముఖ్యనేతలు కమల తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవలే తెదేపాకు రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్, చందు సాంబశివరావు అధికారికంగా సభ్యత్వం తీసుకుంటారు.