ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BJP on YSRCP: వైకాపా పాలనలో కర్షకులకు కష్టాలు: సోము వీర్రాజు - కిసాన్ మోర్చా రైతు గర్జన

BJP on YSRCP: రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో నష్టోయిన రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని భాజపా నేతలు మండిపడ్డారు. తామరపురుగుతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలంటూ.. గుంటూరులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 'రైతు గర్జన' పేరిట మహా ధర్నా చేపట్టారు.

సీఎం సమీక్షలకు పరిమితమయ్యారే తప్ప.. రైతులను ఆదుకోవటం లేదు
సీఎం సమీక్షలకు పరిమితమయ్యారే తప్ప.. రైతులను ఆదుకోవటం లేదు

By

Published : Mar 9, 2022, 10:15 PM IST

Updated : Mar 10, 2022, 5:51 AM IST

BJP on Chilli Farmers: ‘మిర్చి పంటకు తామర పురుగు ఆశించి రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంలో రైతులు అన్ని రకాలుగా నష్టపోయారని, వారిని ఆదుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతామని హెచ్చరించారు. గుంటూరులో కిసాన్‌మోర్చా చేపట్టిన రైతు గర్జనలో సోము వీర్రాజు మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటానికి పోయి రైతులు ఒక్క రూపాయి కడితే చాలని చెప్పి వారి కొంపముంచింది. పీఎం ఫసల్‌ బీమాకు సకాలంలో ప్రీమియం చెల్లించనందునే ఈ దుస్థితి ఏర్పడింది. జగన్‌ సీఎం అయి మూడేళ్లు దాటినా ఇంకా చంద్రబాబుపైనే మాట్లాడటమేంటి?’ అని ధ్వజమెత్తారు.

‘రైతులవద్ద తక్కువ ధరకు ధాన్యం కొని వినియోగదారులకు అధిక ధరకు బియ్యం అమ్మడంతో రూ.వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. కాకినాడ ఎమ్మెల్యే తండ్రి రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉంటే.. ఆయననే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారు?’ అని సోము ప్రశ్నించారు. ‘ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌ మినహా అన్నిచోట్లా భాజపా గెలుస్తుంది. ఒకాయన ఎన్నికలప్పుడు పని లేకున్నా పలు రాష్ట్రాలు తిరిగారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ఇప్పుడు గుర్తుకొస్తుంది. అప్పట్లో సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నారు’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి వీర్రాజు వ్యాఖ్యానించారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న పథకాల నిధులను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథ్‌బాబు, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.

భాజపాకు అవినాష్‌రెడ్డి అక్కర్లేదు:నిబద్ధత గల కార్యకర్తలతోనే తాము ముందుకెళ్తామని, వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి భాజపాకు అక్కర్లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డి భాజపాలో చేరతారని సీఎం జగన్‌ అన్నారా? ఎవరితో అన్నారు? అన్నీ బయటపెట్టాలని డిమాండు చేశారు.

‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పేరుకే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ. యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, శ్రామికులను కరోనా సమయంలో ఆదుకోకుండా, రైతులను కష్టకాలంలో పట్టించుకోకుండా వదిలేసింది. ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో మిగిలింది కాంగ్రెస్‌ మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే వైకాపాకూ పడుతుంది.’ - రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు

ఇదీ చదవండి

ఉపాధ్యాయుల సేవలను ఆ కార్యక్రమాల్లో వినియోగించుకోవద్దు: సీఎం జగన్

Last Updated : Mar 10, 2022, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details