MLAs poaching case: ఎమ్మెల్యేల ఎర కేసులో దర్యాప్తును నిలిపివేయాలని భాజపా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను నిలుపుదల చేయాలని భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్‌లో వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. భాజపాను దుష్ప్రచారం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఉపయోగించుకుంటోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై లోతైన విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.
అయితే భాజపా మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసులో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. పిటిషన్ విచారణలో ఉండగానే సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి వీడియోలు విడుదల చేయడం, పలువురు భాజపా నేతల పేర్లు బయటపెట్టడం వెనక కుట్ర ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై డివిజన్ బెంచ్‌లో వాదనలు జరిగే అవకాశం ఉంది.