ప్రధాని మోదీ ఏడేళ్ల పాలనలో దేశంపై చెరగని ముద్ర వేశారని భాజపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా మోదీ సేవలు.. అందరి మన్ననలు పొందాయని తెలిపారు. ప్రధానిగా మోదీ ఏడేళ్లు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. గుంటూరులో సేవా హి సంఘటన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి మాస్కులు పంపిణీ చేశారు.
రామ జన్మభూమి వివాదం, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ వంటి శతాబ్దాలుగా నలుగుతున్న దీర్ఘకాలిక సమస్యలకు మోదీ పరిష్కారం చూపారని గుర్తు చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ దేశం ముందడుగు వేసిందన్న ఆయన కరోనా కష్టకాలంలోనూ మోదీ ప్రజలకు అండగా నిలిచారని ప్రశంసించారు.