BJP complaints: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ల నేతృత్వంలో పార్టీ నేతల బృందం ఈసీని కలిసింది. ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో తప్పుడు ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపింది.
పార్టీ పరువు ప్రతిష్ఠలను దిగజార్చేందుకు దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని పేర్కొంది. ఉపఎన్నికల్లో భాజపాకు వస్తున్న ఆదరణను దెబ్బతీయడానికి తెరాస చేస్తున్న మరో ప్రయత్నమని తెలిపింది. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ప్రచారాన్ని వెంటనే నిలువరించాలని కమల దళం కోరింది. తెరాస, ఆ పార్టీ కార్యకర్తలపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని.. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు.. ఇతర అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని భాజపా బృందం విజ్ఞప్తి చేసింది.
నగదు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి: మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో గుర్తించామన్న నగదు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని భాజపా నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు.. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు మరో రూ.50కోట్ల చొప్పున ఇస్తామన్నారని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు. ఫామ్‌హౌజ్‌లోని కారులో సీపీ గుర్తించామన్న రూ.15కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసును.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటూ భాజపా నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ శనివారానికి వాయిదా పడింది. రాజకీయ కక్షతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. దర్యాప్తు పారదర్శకంగా జరగడానికి.. సీబీఐకి కేసును అప్పగించాలని భాజపా పిటిషన్లో కోరింది. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. ఈ కేసులో సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరగనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించిన భాజపా ఇవీ చదవండి: