BJP AP State President Worte letter To Supreme CJI: సీబీఐ, ఈడీ కేసుల విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతున్నారని.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి రాసిన లేఖలో తెలిపారు.
పదకొండు అభియోగాలు, పలు సెక్షన్ల కింద సీఎం జగన్‌తోపాటు ఎంపీ విజయసాయి రెడ్డి కేసులున్నాయన్న పురందేశ్వరి.. పదేళ్లకు పైగా బెయిల్‌పై కొనసాగుతున్నారని లేఖలో తెలిపారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యమయ్యేలా నిరోధిస్తున్నారని.. పదేపదే వాయిదాలు వేయించుకోవడం, విచారణకు దూరంగా ఉంటున్నారని వివరించారు. కోర్టులో న్యాయం జరగకుండా అడ్డంకులు సృష్టించడంపై విచారణ జరిపించాలని సీజేఐని కోరారు. లేఖతో పాటు 5 దస్త్రాలను ఆమె జత చేశారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను వాడుకుని పదేపదే కేసుల విచారణను వాయిదా వేయించుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల సుదీర్ఘ కాలంగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పురందేశ్వరి
విజయసాయి రెడ్డిపై ఉన్న ఆరోపణలను పరిశీలిస్తే.. తిమ్మిని బమ్మి చేయగల నేర్పరితనం ఆయనలో ఉందన్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ వెల్లడించిన వివరాల ద్వారా తేటతెల్లమవుతోందన్నారు. మోసం చేయడం, అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం, నేరపూరిత కుట్రకు పాల్పడటం, మోసం చేయడం కోసం ఫోర్జరీ చేయడంతో పాటు అనేక తీవ్రమైన నేరాభియోగాలు విజయసాయి రెడ్డిపై ఉన్నాయన్నారు.ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలరో కూడా వివరించారన్నారు. కేసుల్లో విజయసాయిని దర్యాప్తు సంస్థ కింగ్‌పిన్‌గా పేర్కొందని గుర్తుచేశారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి తర్వాత అప్రూవర్‌గా మారినవారు.. విజయసాయి రెడ్డికి దగ్గరి బంధువులని లేఖలో తెలిపారు. దాంతో పాటు రాష్ట్రంలో తన బినామీల ద్వారా డిస్టలరీలను నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో బయటపడిందన్న ఆమె.. ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఇవే కాకుండా పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడు అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని.. దసపల్లా భూములనూ నిషిద్ధ జాబితా నుంచి తొలగించడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు.
కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా రాష్టాన్ని అభివృద్ధి చేయడంలో వైసీపీ సర్కారు విఫలం - పురందేశ్వరి
అనేక మంది వ్యాపారవేత్తలు, రియల్టర్లను బెదిరించి నామ మాత్రపు డబ్బు చెల్లించి.. అతని కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు కంపెనీల కోసం అనేక ఎకరాల విలువైన భూమిని.. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనుగోలు చేశారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. విశాఖ సమీపంలోని భీమిలి వద్ద అక్రమ మార్గాలలో రాబట్టుకున్న భూముల మార్కెట్ విలువ దాదాపు 177 కోట్లన్న పురందేశ్వరి.. విజయసాయి రెడ్డి కుమార్తె కంపెనీ వాటిని కేవలం 57 కోట్ల రూపాయలకు నామమాత్రపు చెల్లింపులతో కొనుగోలు చేసిందని చెప్పారు. విశాఖకి రాజధాని మార్పిడి గురించి ముందస్తు సమాచారంతో అక్కడ విరివిగా ఆస్తులను సంపాదించేందుకు విజయసాయి రెడ్డి బెయిల్‌ని ఉపయోగించుకున్నారని ఫిర్యాదు చేశారు.
కేసులు నమోదైనప్పుడు జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి తక్కువ ప్రభావంతమైన పదవుల్లో ఉన్నారని.. ఇప్పుడు అత్యున్నత అధికార పదవుల్లో ఉన్నారని గుర్తుచేశారు. తాను బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు నిత్యం అందుకుంటున్నానని తెలిపారు. ఇలాంటి సమస్యలలో కొన్నింటిని బాధ్యత కలిగిన వ్యక్తిగా తాను ప్రస్తావించినప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి బహిరంగంగా విలేఖరుల సమావేశంలో తనను బెదిరించారని లేఖలో సీజేఐకి తెలిపారు. తాను ఇలాంటి అంశాలను భవిష్యత్తులో మాట్లాడితే, ప్రజల మధ్య బయట తిరగకుండా చేస్తానని వ్యక్తిగత దూషణలు చేశారన్నారు.
Purandeshwari Fire on Sand Exploitation: ఇసుక దోపిడీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రతి నెలా రూ.200 కోట్లు: పురందేశ్వరి
విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పే ధైర్యం ఉంటే.. ఏపీలో అలాంటి వారిని ఎలా బెదిరించగలడనే దానిపై తనను బెదిరించిన తీరు ఓ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను, సాక్షులను కూడా అతను ఎలా బెదిరించిగలరో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ముఖ్యులు సైతం ఇదే భయాందోళనలో ఉన్నారన్న పురందేశ్వరి.. ఈ బెదిరింపులను బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు.
పదేళ్లుగా వ్యవస్థలోని కొన్ని అవకాశాలను వినియోగించుకుని బెయిల్‌పై విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంటి వారు నేరాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నందున ప్రజలు మన వ్యవస్థలపై విశ్వాసం కోల్పోతున్నారన్నారు. కావున తన లేఖను పరిశీలించి ప్రస్తావించిన అంశాల్లో జోక్యం చేసుకుని వీరి బెయిల్‌ను తక్షణమే రద్దుచేయాలని వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి దోషులని తేలిన వారిపైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
విజయసాయి రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల వివరాలు, ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖ ప్రతిని, ఇసుక అక్రమ తవ్వకాలపై ఐటీ కమిషనర్‌కు రాసిన ప్రతిని లేఖతో పాటు జతచేశారు. వివేకా హత్యను తప్పుదోవ పట్టించేలా విజయసాయి రెడ్డి చేసిన ప్రసంగ వివరాలు, విశాఖలో అతని భూకుంభకోణాలపై పత్రికా కథనాలను, అలాగే తనను ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేసిన బెదిరింపు ప్రసంగ వివరాలను.. పురందేశ్వరి సీజేఐకి రాసిన లేఖకు జత చేశారు.
Purandeshwari Fire on YSRCP Govt: రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు: పురందేశ్వరి