Birthday Wishes to Pawan Kalyan: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. జనసైనికులు, అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు రాజకీయ నాయకులు జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్.. నిండు నూరేళ్లూ ఆరోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న జనసేనాని.. రియల్ హీరో అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఉండాలంటూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కేక్ కట్ చేసి.. రక్తధాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా రక్తదానం చేశారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట రైతులు పవర్ స్టార్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కౌలు రైతులకు పవన్ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా.. వరినారుతో జనసేన పార్టీ గుర్తు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో పంచాయతీ కార్మికులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జనసైనికులు.. పేద విద్యార్థిని, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వసతి గ్రహంలోని విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలకు పుస్తకాలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.