కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్లో భాగంగా గుంటూరులో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రం ప్రభుత్వం బంద్కు మద్దతు ప్రకటించడంతో వాటిని ముందుగానే డిపోల్లో నిలిపేశారు. దూరప్రాంతాల నుంచి ఉదయాన్నే గుంటూరుకు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వచ్చిన వాహనాల్ని ఉద్యమకారులు అడ్డుకున్నారు. హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. బంద్ కారణంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి.
భారత్ బంద్లో భాగంగా వామపక్షాలు గుంటూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. అక్కడి నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరమని వామపక్ష నాయకులు విమర్శంచారు. గుజరాత్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్ర ప్రజలు పోరాడి, బలిదానాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు.
చోద్యం చూస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం: తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. భారత్ బంద్కు మద్దతుగా గుంటూరులో తెదేపా చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయం నుంచి శంకర్ విలాస్ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి.. అక్కడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఇపుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు అన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగిస్తోంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు.
ఎంపీలంతా రాజీనామా చేయాలి: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఏపీలోని ఎంపీలు అందరూ రాజీనామా చేసి.. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి డిమాండ్ చేశారు. భారత్ బంద్లో భాగంగా గుంటూరు హిందూ కళాశాల కూడలి వద్ద మనవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ప్రవేటీకరణ చేయడమే లక్ష్యంగా భాజపా ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్, ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.
స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసిన వ్యాపారులు..
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ అఖిల పక్షాలు వినుకొండలో నేడు బంద్కు పిలునిచ్చాయి. దేశవ్యాప్తంగా 12 గంటల పాటు జరగనున్న ఈ బంద్లో భాగంగా బంద్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు బంద్కు మద్దుతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. పట్టణంలోని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు.