బీసీలను వంచనకు గురిచేసిన జగన్... ఆ పార్టీకి చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డిని అడ్డం పెట్టుకుని బీసీల గొంతు కోశారని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ల కోత విధించిన ఆ పార్టీకి... బీసీలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంటే వైకాపా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
జగన్ బీసీ ద్రోహిగా మారారు
బీసీలకు 26 ఏళ్లుగా ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి జగన్ బీసీ ద్రోహిగా మారారని విమర్శించారు. వైకాపాకు చెందిన రెడ్డిసంఘం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డితో కేసు వేయించి.. అతను తమ పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. బీసీల అభ్యున్నతి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను ఎందుకు దాఖలు చేయలేదో.. బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.