గుంటూరు జిల్లాలో రైతు కూలీపై దాడి వ్యవహారం ఎస్పీ కార్యాలయానికి చేరింది. బాధితుడు సాంబశివరావు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కొల్లిపొర మండలం మున్నంగికి చెందిన శొంఠి సాంబశివరావు గౌడ్‌పై.. అదే గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి, సందీప్ రెడ్డి ఈనెల 23వ తేదీన దాడి చేశారు. ఆ తర్వాత స్థానిక వైకాపా నేత వేణుగోపాలరెడ్డి బెదిరించారని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే... కేసు లేకుండా రాజీ చేసుకోవాలని కొల్లిపొర ఎస్.ఐ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.
అందుకే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరేందుకు వచ్చినట్లు సాంబశివరావు తెలిపారు. సాంబశివరావుకు బీసీ సంఘాల నేతలు మద్దతు పలికారు. అయితే వారు వచ్చిన సమయంలో ఎస్పీ అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అగ్రకుల దురహంకారానికి ఈ ఘటన నిదర్శనమని బీసీ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారితో పాటు... కేసు పెట్టడంలో జాప్యం చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.