Bar Associations Agitaions: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఛార్టెర్డ్ అకౌంటెంట్ కే. శ్రావణ్‌కుమార్ అరెస్టుపై విజయవాడలో ఏపీ ప్రొఫషనల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులకు.. సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని న్యాయసమాజం తప్పుపడుతోంది. సీఐడీ తీరును ఖండిస్తూ సోమవారం కోర్టు విధులకు దూరంగా ఉండాలని పలు బార్ అసోసియేషన్లు ఏకగ్రీవంగా తీర్మానించాయి. విజయవాడ, మచిలీపట్నంలో.. నిరసన దీక్షలకు చర్యలు చేపట్టారు.
కోర్టు విధులకు గైర్హాజరు కావాలని గుడివాడ, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, అవనిగడ్డ, విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు, మొవ్వ, బంటుమిల్లి, కైకలూరు, మైలవరం, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు, కొవ్వూరు బార్ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఆయా సంఘాల కార్యనిర్వహణ కమిటీలు ఈ మేరకు తీర్మానించాయి. శ్రావణ్ అరెస్టుపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, జడా శ్రావణ్‌కుమార్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌కు ఏపీ సీఐడీ.. సీఆర్పీసీ సెక్షన్ 160, 91కింద నోటీసులు ఇచ్చింది.
న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలతో తమ ముందు హాజరుకావాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు బెదిరేది లేదని న్యాయవాద సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ప్రముఖ న్యాయవాదులకే ఇలాంటి నోటీసులిస్తే మరి సామాన్యుల పరిస్థితేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీరణ హక్కును హరించడమేనని.. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఏపీ విభాగం పేర్కొంది.