TIDCO House Loans: పురపాలక సంఘాల్లో టిడ్కో (పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ఇళ్లకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాన్ని స్వచ్ఛందం పేరిట లబ్ధిదారుల నుంచే వసూలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో టిడ్కో గృహాలను నిర్మిస్తోంది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణమున్న ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 365 చ.అ. ఇంటికి రూ.3.15 లక్షలు, 430 చ.అ. ఇంటికి రూ.3.65 లక్షల రుణాన్ని లబ్ధిదారు పేరిట బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉండగా అవి ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులు రెండు/మూడు/నాలుగు విడతల్లో కట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అధికారులు ఇస్తున్నారు.
పేదలకు భారమే..
గూడు లేని నిరుపేదలు తమకు అధునాతన వసతులతో టిడ్కో ఇళ్లు సమకూరుతాయని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొందరైనా ముందుకొస్తారనే ఆలోచనతో ‘స్వచ్ఛందం’ పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మిగతా వారిపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఇల్లు తమకు దక్కకుండా పోతుందేమోనన్న ఆందోళనతో కొందరు అధిక వడ్డీలకు తెచ్చి అప్పులపాలయ్యే ప్రమాదమూ ఉంది.
అమలు స్వచ్ఛందమేనని ప్రభుత్వం చెబుతున్నా తక్షణమే రుణ వాటాలో కొంత శాతాన్ని చెల్లించడం తలకు మించిన భారమేనని లబ్ధిదారులు అంటున్నారు. ఉదాహరణకు 430 చ.అ. గృహ లబ్ధిదారు ఇప్పటికిప్పుడు రుణ వాటా రూ.3.65 లక్షల్లో 25% అంటే రూ.81,500 కట్టాలి. మిగతా మొత్తాన్ని ఇంటిని అప్పగించే సమయానికి చెల్లించాలి. ఇంత మొత్తాన్ని కట్టే పరిస్థితే ఉంటే ఇన్నాళ్లూ సొంతింటి కోసం ఎందుకు ఎదురుచూస్తామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.