JP NADDA ON CM KCR :తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆకాంక్షించారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జేపీ నడ్డా... బండి పాదయాత్ర గ్రామగ్రామానికి వెళ్తోందని పేర్కొన్నారు. అవినీతి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌పై పోరాటానికి తెలంగాణ ప్రజలు కలసిరావాలని అన్నారు. కేసీఆర్.. బీఆర్‌ఎస్‌తో రావడం కాదు.. వీఆర్‌ఎస్ తీసుకునే సమయం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
''దోపిడీ కోసమే ధరణీ పోర్టల్ తెచ్చారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామికి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘంగా కాలంగా ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌కు అభినందనలు. ఈ యాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయం, ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదు.'' - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
తెలంగాణలో కేసీఆర్ పాలనకు విశ్రాంతి... బీజేపీకి అధికారంలోకి వచ్చే సమయం వచ్చిందని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని వెల్లడించారు. ఎస్సీ, ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్ఠించారని తెలిపారు. కేసీఆర్... ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.
Bandi Sanjay gets emotional: కరీంనగర్‌లో నిర్వహించిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీటిపర్యంతమయ్యారు. సభకు హాజరైన ప్రజలను చూసి.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం సభలో మాట్లాడుతూ... కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని వ్యాఖ్యానించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని హామీనిచ్చారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానని వెల్లడించారు. అవమానాలకు భయపడే వ్యక్తి కాదు ఈ బండి సంజయ్ అని పేర్కొన్నారు. కార్యకర్తలు, ప్రజలు కష్టార్జితం వల్ల ఎంపీగా గెలిచానని తెలిపారు.
నాకు డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. నా గెలుపుతో దేశం ఆశ్చర్యపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడిగా నియమానికి కారణం కరీంనగర్ కార్యకర్తలే. ప్రజలే అభిమానంతో గెలిపించారని మోదీ, అమిత్‌షా గుర్తించారు. కాషాయ జెండాతో రాష్ట్రాన్ని పవిత్రం చేయాలని భాజపా అధిష్ఠానం చెప్పింది. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ పేరుందని టీఆర్‌ఎస్‌కు 2 సార్లు ఓట్లు వేశామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ పదాన్ని తొలగించారన్నారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదని వెల్లడించారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ తెలంగాణకు మోసం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మద్యం పేరుతో దోచుకున్నారు, భూములు లాక్కున్నారని ఆరోపించారు.