Andhra Pradesh Passengers in Odisha Train Accident: ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 482 మంది ప్రయాణించారని.. వారిలో 267 మంది క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 20 మందికి తేలికపాటి గాయాలైనట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్ రైల్లో రాష్ట్రానికి చెందిన 89 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారని.. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 28 మంది వివరాలు తేలాల్సి ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారిలో కొంతమంది మెరుగైన వైద్యం కోసం వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించింది. కోరమాండల్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌ల్లో కలిపి 141 మంది ప్రయాణికుల ఫోన్లు పనిచేయడం లేదని తెలిపింది. దీంతో మరికొంత మంది తెలుగు ప్రయాణికులు అసలు ఏమయ్యారో, ఎక్కడున్నారో అనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Odisha Train Accident : 'ఘోర'మాండల్ రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగిందంటే?
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు: కోరమాండల్ రైలు దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్ర ప్రయాణికులకు అవసరమైన సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నామని.. ప్రభుత్వం తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారని మంత్రి బొత్స తెలిపారు. మంత్రి అమర్‌నాథ్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాన్ని ఒడిశాకు పంపామన్నారు. 50 అంబులెన్సులు, వైద్య పరికరాలు, మందులు, వైద్యులతో కూడిన బృందాలు, 15 మహాప్రస్థానం వాహనాలను ప్రమాద స్థలికి తరలించామన్నారు. అత్యవసర సమయంలో తరలించేందుకు విశాఖలో ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచామన్నారు.
బాధితులతో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. బాలాసోర్‌లోని ఎస్ఎమ్ఎమ్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ వాసులను మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం రాత్రి పరామర్శించారు. విశాఖ నుంచి బాలాసోర్ రోడ్డు మార్గంలో చేరుకున్న ఆయన నేరుగా ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 11 మంది క్షతగాత్రులను గుర్తించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.
Telugu Passengers భూమి కంపించినట్లైంది.. తలచుకుంటేనే వణుకుపుడుతోంది.. తెలుగు ప్రయాణికుల అనుభవాలు
జీవనోపాధి కోసం వెళ్లి..: బతుకుదెరువు కోసం చాలా సంవత్సరాల క్రితమే ఒడిశాలోని బాలేశ్వర్‌కు వెళ్లి వలలు అల్లుకుంటూ, చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన చోడిపల్లి గురుమూర్తి రైలు ప్రమాదంలో మృతి చెందారు. గురుమూర్తి ఏపీ ప్రభుత్వ పింఛను కోసం గ్రామానికి వచ్చి ఈ నెల 2వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. పలాస రైల్వేస్టేషన్లో యశ్వంత్‌పూర్- హావ్‌డా రైలు ఎక్కి ప్రమాదంలో మృతిచెందారు. బాలేశ్వర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని గుర్తించి శనివారం అంత్యక్రియలు చేశారు.