Balapur Ganesh Laddu Auction 2023 : ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu) వేలంపాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు.. వేలంపాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
Balapur Ganesh Laddu History : 28 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోన్న లడ్డూ వేలంపాట.. 1994లో రూ.450తో మొదలైంది. ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షల పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంటుంది. గతేడాది స్థానికుడైన వంగేటి లక్ష్మారెడ్డి రూ.24,60,000లు లడ్డూను దక్కించుకున్నారు. 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది.
2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి రూ.4,15,000కు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10,32,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2016లో నాలుగు లక్షలు పెరిగింది.
Balapur Ganesh :ఆ సంవత్సరం మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000కు కైవసం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15,60,000కు పొందగా.. 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16,60,000కు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రాంరెడ్డి 17,60,000 పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.
Silver Ganesh Idol in Nizamabad : వెండి పత్రాలతో ఆకట్టుకుంటున్న వినాయకుడి విగ్రహం