Big size lagoons on Road: ఇవి స్విమ్మింగ్ పూల్స్ అనుకుంటున్నారా.. లేదు.. ఇంకుడు గుంతలని భావిస్తున్నారా.. పైనుంచి చూడండి కచ్చితంగా కనిపెడతారేమో.. ఒక్కచోటే ఇన్ని గుంతలున్నాయంటే.. ఇవి పంటకుంటలు అనుకుంటారా ఏంటి? అలాగైతే ఈ మడుగుల్లో మీరూ అడుగులు వేసినట్లే.. ఇదీ ఓ రోడ్డే.. నమ్మక తప్పదు మరి.. ఇదేదో మారుమూల పల్లెకో, గిరిజన గూడేనికో.. వెళ్లే రోడ్డు కాదు. రాష్ట్రంలోనే ప్రధాన నగరాల్లో ఒకటైన గుంటూరులోని ఒక ప్రధాన రహదారి.
పైనుంచి చూడడానికి ఏముంది చిన్నగోతులేగా అనుకునేరు.. కిందకు వెళ్తే వామ్మో ఇవేం గోతులు అని బెంబేలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఆటోలు, బైకులు, చివరకు బస్సులైనా సరే ఈ గోతుల్లో, అందులో నిలిచిన నీళ్లలో ఈదుతుంటాయి.
చూసేవాళ్లకు మనకే ఇలా ఉంటే.. తిరిగే వాళ్లకు ఎలా ఉంటుంది చెప్పండి. రోడ్డుమీద గుంతలు కాదు.. గుంతల మధ్య రోడ్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సాహసయాత్ర చేయడం.. సురక్షితంగా రోడ్డు దాటినవాళ్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం, డ్రైవింగ్ వచ్చినా.. ఈ రోడ్డుమీద నడపలేక పడిపోవటం, ఎవరో ఒకరు వచ్చి లేపటం.. ఒంట్లో అవయవాలు, వాహనంలో పార్టులు బాగున్నాయో లేదో చూసుకోడం ఇవన్నీ.. ఈ రోడ్డులో వెళ్లేవాళ్లకు అలవాటైపోయింది.